petrol: పెట్రోల్, డీజిల్ కావాలంటే ఇప్పుడే వెళ్లండి!

  • నేటి అర్ధరాత్రి నుంచి అమ్మకాలు నిలిపివేత
  • బంకుల వద్ద పెరుగుతున్న క్యూలైన్లు
  • జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తేవాలని డిమాండ్

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ సహా, తమ న్యాయమైన కోరికల పరిష్కారాన్ని కోరుతూ నేటి అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి వరకూ పెట్రోలు బంకులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఈ ఉదయం బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రేపు పెట్రోలు, డీజిల్ కొనాలని భావించే వారు సైతం నేడు బంకుల వద్దకు చేరుతున్నారు.

కాగా, క్రూడాయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం ప్రభుత్వం తగ్గించడం లేదని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల విషయంలో ప్రపంచంలో ఒక్కో దేశంలో దేశమంతటా ఒకే రేటు అమలవుతుంటే, ఇండియాలో మాత్రం రాష్ట్రానికో రేటు ఉందని గుర్తు చేసిన వారు, ఏకపక్ష ధోరణితో కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు.

హోటళ్లలో మాదిరిగా బంకులలో మరుగుదొడ్లు ఉండాలని ఆదేశించడం హాస్యాస్పదమని విశాఖ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ ఒకరోజు నిరసనతో తమ డిమాండ్లు పరిష్కారం కాకుంటే, 27 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

More Telugu News