keshav: అసలు నా తప్పేముంది?... చంద్రబాబు ఆగ్రహంపై పయ్యావుల మనస్తాపం!

  • చంద్రబాబుకు సరైన సమాచారం అందలేదు
  • అందువల్లే నేను మాటలు పడ్డాను
  • నమస్కారం పెట్టి వెళ్లిపోతే, కేసీఆర్ పిలిపించారు
  • సన్నిహిత నేతల వద్ద వాపోయిన పయ్యావుల

పరిటాల శ్రీరామ్ వివాహం నాడు కేసీఆర్ తో కాసేపు ఏకాంతంగా మాట్లాడిన తన వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పయ్యావుల కేశవ్, మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంలో చంద్రబాబుకు సరైన సమాచారం అందలేదని, అందువల్లే తాను మాటలు పడాల్సి వచ్చిందని ఇతర టీడీపీ నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించిన ఆయన, పరిటాల ఇంట పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని చెప్పారు. కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానని, ఆ వెంటనే తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని ఆయన పంపి తనను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లానని చెప్పారు. ఆయనే తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదని అన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు.

కాగా, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమైన వేళ, కేసీఆర్, పయ్యావుల ఏకాంత చర్చలను ప్రస్తావించి, ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయిలో కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా చేయడం మినహా మరో మార్గం తమ ముందు ఉండబోదని హెచ్చరించినట్టు సమాచారం.

More Telugu News