jammu: మగవాళ్లు తోడు లేకుండా బయటికెళ్లొద్దు!: ముస్లిం మహిళలకు మార్గదర్శకాలు

  • జమ్మూలోని ముస్లింలకు ఇస్లామిక్‌ మర్కాజీ మజ్లీస్‌-ఎ-షౌర ఆదేశాలు
  • మగాళ్ల తోడు లేకుండా బయటికెళ్లొద్దు
  • పెళ్లిళ్లలో మ్యూజిక్, డాన్స్ లు పెట్టుకుంటే బహిష్కరణే
  • నిశ్చితార్ధం జోలికి పోవద్దు.. నేరుగా నిఖానే

ముస్లింలకు పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ జమ్మూలోని కిష్వార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉర్దూ గోడపత్రికలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. కిష్వార్ జిల్లాలోని ‘ఇస్లామిక్‌ మర్కాజీ మజ్లీస్‌-ఎ-షౌర’( ఇస్లామిక్‌ కేంద్ర సలహా మండలి) మగవారి తోడు లేకుండా ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. సర్కస్‌ లు, ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలకు మగతోడు లేకుండా ముస్లిం మహిళలు వెళ్లనే వెళ్లకూడదని స్పష్టం చేసింది. అంతే కాకుండా పెళ్లిళ్ల సమయంలో నృత్య, సంగీత కార్యక్రమాలను నిర్వహించే కుటుంబాలకు సామాజిక బహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది.

పెళ్లి, నిశ్చితార్థాల వంటివి చేయకుండా సరాసరి ‘నిఖా’లనే నిర్వహించాలని పేర్కొంది. నిశ్చితార్థాల వల్ల సమాజంలో లేనిపోని దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ముస్లింలు పనీపాట లేకుండా బజార్లలో తిరగడం కంటే మసీదుకు వెళ్లి క్రమం తప్పకుండా ఐదు సార్లు నమాజు చేయాలని సూచించింది. ఈ గోడపత్రికలు కలకలం రేపగా, ఇందుకు సంబంధించిన కరపత్రికలు కూడా పంచినట్టు తెలుస్తోంది. జిల్లాలోని జామియా మసీదుతో పాటు ఇతర మసీదులు, వీధుల్లో వీటిని అతికించినట్టు సమాచారం. 

More Telugu News