Doklam: భారత్ ఇప్పుడు ‘సూపర్ పవర్’.. కాబట్టే డోక్లాం సమస్య పరిష్కారమైంది: రాజ్‌నాథ్

  • భారత్ బలహీనంగా ఉంటే డోక్లాం సమస్య ఇప్పటికీ కొనసాగి ఉండేది
  • ఇండియా ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు
  • విశ్వకర్మ జయంత్యుత్సవంలో హోంమంత్రి వ్యాఖ్యలు

భారత్ ఇప్పుడు ‘సూపర్ పవర్’ కాబట్టే డోక్లాం సమస్య పరిష్కారమైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రి కూడలిలో చైనా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్ఠంభన 71 రోజులపాటు కొనసాగింది. భారత్-చైనా బలగాలు ఒకానొక దశలో ముఖాముఖీ తలపడ్డాయి కూడా. దీంతో జూన్‌లో మొదలైన ఉద్రిక్తత ఆగస్టు వరకు కొనసాగింది. చివరికి ఇరు దేశాలు తమ భూభాగం నుంచి సైన్యాన్ని వెనక్కి పిలవడంతో ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడింది.

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన విశ్వకర్వ జయంత్యుత్సవంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠ బాగా పెరిగిందని అన్నారు. భారత్ ప్రపంచ శక్తి (సూపర్ పవర్)గా ఎదుగుతుండడం వల్లే డోక్లాం సమస్య పరిష్కారమైందన్నారు. డోక్లాం విషయంలో భారత్ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదని, చాలా పరిపక్వత ప్రదర్శించిందని అన్నారు. భారత్ కనుక బలహీనంగా ఉండి ఉంటే డోక్లాం సమస్య ఇప్పటికీ అలాగే ఉండేదని అభిప్రాయపడ్డారు.   

More Telugu News