protocol: రైల్వే కీలక నిర్ణయం.. 36 ఏళ్ల వీఐపీ కల్చర్‌కు స్వస్తి!

  • 1981 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ
  • రైల్వే బోర్డు చైర్మన్ పర్యటనలకు జనరల్ మేనేజర్లు అక్కర్లేదని ఉత్తర్వులు
  • సీనియర్ అధికారుల ఇళ్లలో పనిచేస్తున్న సిబ్బందిని రిలీవ్ చేయాలని ఆదేశాలు

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని నిర్ణయించింది. అందులో భాగంగా 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గతనెల 28నే రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  

రైల్వే సిబ్బందిని ఉన్నతాధికారులు సొంత పనుల కోసం వాడుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ అటువంటి వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించింది. సీనియర్ అధికారుల ఇళ్లలో 30 వేల మంది ట్రాక్‌మెన్లు పనిచేస్తున్నారని, వారందరినీ తిరిగి విధుల్లో చేరాల్సిందిగా కోరినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 7 వేల మంది విధుల్లో చేరినట్టు పేర్కొన్నారు.

అలాగే అధికారులు ఇకపై ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కాకుండా స్లీపర్, ఏసీ త్రీటైర్‌లలో ఇతర ప్రయాణికులతో కలిసి ప్రయాణించాలని మంత్రి పీయూష్ గోయల్ కోరారు. అలాగే ఉన్నతాధికారుల పర్యటనల్లో బొకేలు, బహుమతులు ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ ఇకపై ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దని అధికారులకు సూచించారు.
 
 

More Telugu News