jaitley: 'సమయం లేదు మిత్రమా' అంటున్న అరుణ్ జైట్లీ!

  • ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ, డీమానిటైజేషన్ ప్రభావం
  • ఇప్పటికే తగ్గిన వృద్ధి రేటు
  • ఇక జీడీపీని పెంచేందుకు కదలాలని సూచించిన జైట్లీ
  • వారం రోజుల పాటు అమెరికాలో పర్యటన

స్వచ్ఛ భారత్, జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు... ఈ మూడు ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలు. వీటిల్లో మొదటిదైన స్వచ్ఛ భారత్ ను పక్కన పెడితే, వస్తు సేవల పన్ను అమలు, నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆర్థిక వ్యవస్థను ఎన్నో మెట్లు దిగజార్చాయి. ఇక ఇదే విషయాన్ని వాషింగ్టన్ లో జరిగిన 'బెర్క్ లీ ఇండియా కాన్ఫరెన్స్' పేరిట జరిగిన సదస్సులో ప్రస్తావించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మోదీ చేపట్టిన సంస్కరణలకు ప్రజల నుంచి ఎంతో మద్దతు లభించిందని అన్నారు.

ఇక సమయం లేదని, సాధ్యమైనంత త్వరగా వృద్ధి రేటును పెంచేందుకు భారత ప్రభుత్వ అధికారులు కృషి చేయాల్సివుందని అన్నారు. ఇక సమయం లేదని అభిప్రాయపడ్డ ఆయన, జీడీపీని మరింతగా పెంచేందుకు, ప్రజల ఆకాంక్షల మేరకు లక్ష్యాలను సాధించేందుకు, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు యంత్రాంగమంతా శ్రమించాలని సూచించారు.

 తదుపరి రెండు దశాబ్దాలు భారత్ కు అత్యంత కీలకమని, మరింత వేగంగా ఇండియా దూసుకెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సంస్కరణల అమలు కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజా జీవనం ప్రభావితం కాలేదని అన్నారు. పన్ను వసూళ్లపై వస్తు సేవల పన్ను ప్రభావం ఉందని, చాలా మందిలో రిటర్నుల దాఖలుకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తామని తెలిపారు.

పన్ను పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని, లక్షలాది మంది స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని, దేశాభివృద్ధికి ఇది అత్యంత ప్రోత్సాహకరమని జైట్లీ వెల్లడించారు. కాగా, వారంరోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్న జైట్లీ, న్యూయార్క్, బోస్టన్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో భారత్ తరఫున పాల్గొననున్నారు.

More Telugu News