Shiva lingam: రూ.20 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం.. రోడ్డు ప్రమాదంలో బయటపడిన వైనం!

  • కారుపై అధికార అన్నాడీఎంకే పార్టీ గుర్తు
  • రాజకీయ నాయకుల ప్రమేయంపైనా పోలీసుల ఆరా
  • పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువ చేసే మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధురై నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారు పుదుకోట జిల్లా విరాళిమలై సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారులో 8 కిలోల బరువైన మరకత లింగాన్ని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.20 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను విచారిస్తున్నారు. లింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తదితర వివరాల గురించి ఆరా తీస్తున్నారు. కాగా, మరకత లింగాన్ని తరలిస్తున్న కారుపై అన్నాడీఎంకే జెండా ఉండడంతో ఈ ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News