campus placements: క్యాంపస్ ప్లేస్ మెంట్లలో ఐఐటీలను మించిపోయిన ఇంజనీరింగ్ కాలేజీలు... 15 శాతం పెరిగిన వేతనం!

  • ఎక్కువ ఉద్యోగాలు మౌలిక, నిర్మాణ రంగాల్లో
  • నియామకాల్లో ఎల్అండ్ టీ, మారుతి సుజుకి, శాంసంగ్ జోరు
  • రూ. 39 లక్షలు దాటిన హయ్యస్ట్ ఆఫర్
  • సరాసరి వేతనం రూ. 16 లక్షలకు పైగానే

ఇండియాలో వృద్ధి రేటు మందగించిన వేళ, ఓ వైపు ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగిస్తుంటే, కొత్త ఉద్యోగాల సృష్టిలో ఇంజనీరింగ్ విభాగం దూసుకెళుతోంది. ఈ సంవత్సరం ఐఐటీలతో పోలిస్తే, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరంతో పోలిస్తే మరింత వేతనంతో పాటు అధిక ఉద్యోగాలను ఇంజనీరింగ్ రంగం ఆఫర్ చేసింది.

క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో సాఫ్ట్ వేర్ రంగం కంటే, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ రంగాలు ముందున్నాయని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ ప్లేస్ మెంట్స్ విభాగం హెడ్ ఆర్ఎస్ వాలియా వెల్లడించారు. అమేజాన్, డైరెక్ట్, పీడబ్ల్యూసీ, ఎల్అండ్ టీ, మారుతి సుజుకి, ఎయిర్ టెల్, శాంసంగ్ తదితర కంపెనీలు ఎన్నో రిక్రూట్ మెంట్ కు వచ్చాయని, గత సంవత్సరంతో పోలిస్తే కనీసం 10 శాతం అధిక వేతనాల ఆఫర్లు లభించాయని, కొందరికి 15 శాతం అధిక ఆఫర్ వచ్చిందని ఆయన తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్లేస్ మెంట్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు వస్తున్న కంపెనీల సంఖ్య ఈ ఏడాది అధికంగా ఉందని అన్నారు.

ఇక బిట్స్ పిలానీ మూడు క్యాంపస్ లలో గత సంవత్సరం 546 మందికి ఉద్యోగాలు లభించగా, ఈ సంవత్సరం 586 మందికి ప్లేస్ మెంట్స్ లభించాయి. నౌటానిక్స్ అనే కంపెనీ అత్యధికంగా రూ. 39.48 లక్షల ప్యాకేజీని అందించింది. సరాసరి వేతనం రూ. 16.05 లక్షలకు చేరుకుంది. వరంగల్ లోని ఎన్ఐటీలో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ. 36 లక్షల ప్యాకేజీ లభించగా, క్వాల్ కామ్, అమేజాన్, ఫిడిలిటీ సంస్థలు గరిష్ఠ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చాయి.

తిరుచ్చిలోని ఎన్ఐటీలో 1,200 మందికి ప్లేస్ మెంట్స్ లభించగా సరాసరి వేతనం రూ. 8.5 లక్షలను తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్ టీ సంస్థలు ఎక్కువ ఉద్యోగాలను ఇచ్చాయి. ఐటీ కళాశాలల ప్లేస్ మెంట్స్ ను పరిశీలిస్తే, ఐబీఎం, విప్రో, ఒరాకిల్ వంటి సంస్థలు రూ. 20 లక్షల వేతన ప్యాకేజీతో కొత్త ఉద్యోగులను తీసుకుంటుండటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News