Tortured for Two Years: యజమాని హింస భరించలేక.. 11వ అంతస్తు నుంచి కిందకు దూకేసిన బాలిక!

  • బాలికపై రెండేళ్లుగా ఓ యువతి శారీరక హింస
  • ఇంట్లోంచి బయటకు రానివ్వని వైనం
  • చిన్నారిని పనిలో పెట్టుకుని రాక్షసిలా ప్రవర్తించిన మహిళ 
  • ఢిల్లీకి స‌మీపంలోని ఫ‌రిదాబాద్‌లో ఘటన

రెండేళ్లుగా ఓ యువతి పెడుతున్న శారీరక హింసను తట్టుకోలేక ఓ బాలిక‌ 11వ అంతస్తు నుంచి కిందకు దూకేసిన ఘ‌ట‌న ఢిల్లీకి స‌మీపంలోని ఫ‌రీదాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని కనిష్క టవర్స్ లో ఓ యువ‌తి (23) నివ‌సించేది. బీహార్‌కు చెందిన ఆమె అక్కడ తన చదువును కొనసాగించేది. త‌న‌కు తోడుగా ఉండేందుకు త‌న గ్రామం నుంచి ఓ బాలిక (10)ను త‌న‌తో పాటు తెచ్చుకుంది. కొన్ని రోజులు ఆ బాలిక‌ను బాగానే చూసుకున్న ఆ యువ‌తి.. ఆ త‌రువాత త‌న అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టింది. ఆ బాలిక‌ను ఇంట్లోంచి బయటకు రానివ్వ‌లేదు. ప్ర‌తిరోజు ఇంట్లో హింసించేది.

ఆమె కొట్టే దెబ్బ‌ల‌కు ఆ బాలిక వీపంతా గాయాలతో నిండిపోయింది. ప్ర‌తి రోజు ఆ బాలిక ఇంట్లోనే ఏడుస్తూ ఉండేది. ఆ యువ‌తి పెట్టే బాధ‌లను తట్టుకోలేక చివరకు 11వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తు కింది ఫ్లోర్ లోని గూడులాంటి ప్ర‌దేశంలో ఇరుక్కుపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ బాలిక‌ను కిందికి దించిన పోలీసులు ఆమెకు ఆసుప‌త్రిలో చికిత్స చేయించారు.

ఆ బాలిక శరీర భాగాలపై ఆ యువతి వాతలు పెట్టిందని పోలీసులు చెప్పారు. బాల కార్మిక చట్టం కింద ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ఆ బాలిక‌ను తల్లిదండ్రులకు అప్ప‌గించేవ‌ర‌కు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచుతామ‌ని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాల కార్మిక వ్యవస్థను ఖండిస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ బాలికకు న్యాయం చేస్తామని చెప్పారు.  

  • Loading...

More Telugu News