radhe ma: పోలీసు అధికారి కుర్చీలో రాధేమా... విచార‌ణ‌కు ఆదేశం

  • రాధేమా‌కు స‌క‌ల మ‌ర్యాద‌లు చేసిన పోలీసులు
  • ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌పెట్టిన మీడియా
  • చిక్కుల్లో పోలీస్ స్టేష‌న్ హెడ్‌

భ‌క్తి పేరుతో మోసాలు చేస్తున్న బాబాల గురించి వాస్తవాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతున్న స‌మ‌యంలోనే `రాధేమా`కు సంబంధించి కొన్ని వివాదాస్ప‌ద ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. వీటిలో ఆమె పోలీసు అధికారి కుర్చీలో కూర్చుని ఉండ‌గా, ప‌క్క‌నే పోలీసు అధికారి చేతులు క‌ట్టుకుని నిల్చుని ఉన్న ఫొటో వివాదాస్ప‌ద చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. ఆమె తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్‌ పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన‌పుడు తీసిన ఈ ఫొటోల‌ను ఓ మీడియా ఫొటోగ్రాఫ‌ర్‌ బ‌య‌ట‌పెట్టాడు.

`రాధేమా`కు అతిథి మ‌ర్యాద‌లు చేస్తున్న పోలీసులు అంటూ ఆ ఫొటోగ్రాఫ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోలీసు స్టేష‌న్ హెడ్ సంజ‌య్ శ‌ర్మ మీద విచార‌ణ చేయాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ ఆదేశించింది. అంతేకాకుండా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఆమె మీద పువ్వులు చ‌ల్లుతూ పోలీసులు డ్యాన్స్‌లు చేసిన వీడియోలను కూడా ఫొటోగ్రాఫ‌ర్ బ‌య‌ట‌పెట్టాడు.

అయితే ఆమె ఆ పోలీస్ స్టేష‌న్‌కు ఎందుకు వ‌చ్చింద‌న్న కార‌ణం మాత్రం తెలియ‌రాలేదు. హిందీ పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ భ‌క్తుల‌ను ఆశీర్వ‌దించే రాధేమా అస‌లు పేరు సుఖ్వీంద‌ర్ కౌర్‌. ఆమెను దుర్గా దేవిగా అనుకుని భ‌క్తులు పూజ‌లు చేస్తుంటారు.

More Telugu News