national and state elections together: 2018లో 'జమిలీ' ఎన్నికలు వస్తే... నిర్వహించగల సత్తా తమకుందని ఈసీ ప్రకటన

  • వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి సరిపడా ఈవీఎంలు
  • నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే
  • రాష్ట్రాలు అంగీకరించకుంటే చట్ట సవరణ తప్పదు
  • ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్

దేశవ్యాప్తంగా పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపించాలని, అప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్న నేపథ్యంలో భారత ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ తో పాటు అసెంబ్లీల ఎన్నికలను ఏ ఇబ్బందులూ లేకుండా ఒకేదఫా జరిపించే సత్తా తమకుందని ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరమే జమిలీ ఎన్నికలు జరిపించాల్సి వచ్చినా, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లనూ తాము పూర్తి చేయగలమని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు అవసరమైనన్ని కొత్త ఈవీఎంలు సెప్టెంబర్ 2018కి తమ వద్ద ఉంటాయని ఆయన వెల్లడించారు.

అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, పలు రాష్ట్రాల అసెంబ్లీలను కేంద్రం రద్దు చేయాల్సి వుండటం పెద్ద అవాంతరమని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలకు అంగీకరించని రాష్ట్రాల అసెంబ్లీల రద్దు చట్ట సవరణ ద్వారా మాత్రమే సాధ్యమని గుర్తు చేశారు. కాగా, వచ్చే సంవత్సరంలో కర్ణాటక, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాలకు, ఆపై 2019లో ఏపీ, తెలంగాణ సహా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, తెలంగాణ పార్లమెంట్ కు ఎన్నికలు జరగాల్సి వుందన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమిలీ ఎన్నికలు జరపాలంటే, ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల తరువాత అడుగులు పడాల్సి వుంటుంది.

దాదాపు 12 రాష్ట్రాలకు, పార్లమెంట్ కు నవంబర్ లేదా డిసెంబర్ 2018లో ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను కనీసం ఆరు నెలల ముందుగా రద్దు చేయాల్సి వుంటుంది. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరిపించాలన్న మోదీ ఆలోచనకు ఈ నిర్ణయం అత్యంత కీలకం.  

More Telugu News