honeypreet: ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా.. పోలీసులకు చుక్కలు చూపుతున్న హనీప్రీత్!

  • ప్రతి ప్రశ్నకూ తెలియదనే సమాధానం
  • కేసులెందుకు పెట్టారని పోలీసులకే హనీప్రీత్ ఎదురు ప్రశ్నలు
  • నేడు కూడా కొనసాగనున్న విచారణ

నిన్న పంచకుల కోర్టులో హనీప్రీత్ సింగ్ ను హాజరు పరిచిన పోలీసులు ఆమెను తదుపరి విచారణ నిమిత్తం ఆరు రోజుల కస్టడీకి తీసుకుని, తమకున్న సందేహాలపై ప్రశ్నిస్తుండగా, ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానాన్ని ఇవ్వకుండా ఆమె పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. డేరాతో, డేరా చీఫ్ గుర్మీత్ తో ఆమెకున్న సంబంధాలు, గుర్మీత్ కు శిక్షపడిన తరువాత జరిగిన విధ్వంసం వెనుక ఆమె హస్తం తదితరాలపై హర్యానా పోలీసులు ఎంతగా గుచ్చిగుచ్చి అడుగుతున్నా, ఆమె నోరు విప్పడం లేదని అధికారులు అంటున్నారు.

ప్రతి ప్రశ్నకూ ఆమె నుంచి 'నాకు తెలియదు, లేదు, కాదు' అన్న సమాధానాలే వస్తున్నాయని చెబుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి దాదాపు నాలుగైదు గంటల విచారణ తరువాత, ఈ ఉదయం తిరిగి విచారణ ప్రారంభమైంది. హనీప్రీత్ విచారణకు సహకరించడం లేదని, తనపై ఆరోపణలు తప్పుడువని ఆమె చెబుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారని హనీప్రీత్ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక నిజాలను కక్కించేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆమె ముందు నేడు బయట పెట్టనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, విచారణ జరుగుతున్న ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News