h-1b: టెక్కీలకు శుభవార్త... హెచ్-1బీ ప్రాసెసింగ్ ను తిరిగి ప్రారంభించిన యూఎస్

  • పదిహేను రోజుల్లోనే కొత్త దరఖాస్తుల ప్రాసెసింగ్
  • ప్రకటించిన యూఎస్ సీఐఎస్
  • గత ఏప్రిల్ లో నిలిచిన వీసాల ప్రాసెసింగ్

అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసి చేతినిండా సంపాదించుకోవాలని భావించే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు శుభవార్త చెప్పింది. హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను అన్ని విభాగాల్లో తిరిగి ప్రారంభించామని ప్రకటించింది. గత ఏప్రిల్ నెలలో అధిక రద్దీ కారణంగా కొత్త వీసా పిటిషన్ల స్వీకరణను యూఎస్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) ఓ ప్రకటన చేస్తూ, వీసాల జారీని తిరిగి ప్రారంభించామని తెలిపింది. కాగా, భారత ఐటీ ప్రొఫెషనల్స్ కు ఈ వీసా ఎంతో ముఖ్యమన్న సంగతి తెలిసిందే. ప్రతి యేటా అమెరికా 65 వేల హెచ్-1బీ వీసాలను ఇస్తుంటుంది. వాటిల్లో 20 వేల వీసాలను యూఎస్ ఉన్నత విద్యా మండలి నిర్వహించే స్టెమ్ సబ్జెక్టులను అభ్యసించే వారికి ఇస్తుంది. వీసాల్లో అకాడమిక్, రీసెర్చ్, జాబ్ వంటి పలు విభాగాలు ఉన్నాయి. కొత్త దరఖాస్తులపై తమ నిర్ణయాన్ని 15 రోజుల్లోగా ప్రకటిస్తామని కూడా ఎస్సీఐఎస్ తెలిపింది. కాగా, భారత్, యూఎస్ సంబంధాల మెరుగుదల విషయంలో వీసాలు ఎంతో ముఖ్యమైనవని ఇండియాలో యూఎస్ దౌత్యాధికారి కెన్నీత్ జుస్టర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News