brad hogg: 47 ఏళ్ల వయసులోనూ క్రికెట్‌ను వదిలేది లేదంటున్న ఆసీస్ క్రికెటర్

  • తనలో ఇంకా సత్తా ఉందన్న బ్రాడ్ హగ్
  • అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే ప్రస్తక్తే లేదని వ్యాఖ్య
  • ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన హగ్ 

ప్రస్తుత క్రికెట్‌లో వేగం పెరిగింది. దానిని తట్టుకుని నిలబడాలంటే ఫిట్‌నెస్ అవసరం. దానిని కాపాడుకోలేకే చాలామంది యువ క్రికెటర్లు వచ్చినంత వేగంగా కనుమరుగవుతున్నారు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేకుండానే క్రికెట్‌కు దూరమవుతున్నారు. అయితే వీరికి తాను పూర్తిగా భిన్నమంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హగ్. 47 ఏళ్లు వస్తున్నా తానింకా పూర్తి ఫిట్‌గా ఉన్నానని, కాబట్టి అంతర్జాతీయ  క్రికెట్‌ను వదిలే ప్రసక్తే లేదని అంటున్నాడు.

భారత్-ఆసీస్ సిరీస్‌లో కామెంటరీ చెప్పేందుకు భారత్‌కు వచ్చిన హగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వయసు గురించి అస్సలు ఆలోచించడం లేదని పేర్కొన్నాడు. వయసు పెరుగుతోందని అంతర్జాతీయ  క్రికెట్‌కు గుడ్ బై చెప్పే ఆలోచన లేదన్నాడు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఆటగాడి కలని, బాగా ఆడుతున్నంత సేపు క్రికెట్‌ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అవకాశం లభిస్తే దేశం తరపున మళ్లీ ఆడతానని మనసులోని మాటను వెల్లడించాడు. కాగా, ఈ సీజన్‌లో హగ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడాడు.

More Telugu News