nellore: విదేశీ రొట్టెకు ఫుల్ డిమాండ్, సంతాన, ఉద్యోగ రొట్టెలకు కూడా..!

  • రెండో రోజు కిటకిటలాడుతున్న బారా షాహిద్ దర్గా
  • అమరులకు నివాళులు అర్పిస్తున్న లక్షలాది మంది భక్తులు
  • మరో మూడు రోజులు సాగనున్న రొట్టెల పండగ

నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రెండో రోజు రొట్టెల పండగ మతాలకు అతీతంగా వైభవంగా సాగుతోంది. స్వర్ణాల చెరువు నుంచి.. పొదలకూరు నుంచి దర్గాకు వెళ్లే మార్గం వరకూ భక్తులతో కిటకిటలాడుతుండగా, ఇప్పటివరూ రెండున్నర లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుని అమరులకు నివాళులు అర్పించారు. తదుపరి మూడు నాలుగు రోజుల్లో మరో పది లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సంవత్సరం విదేశీ రొట్టెకు ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లాలని భావించే యువత, ఉత్సాహంగా ఈ రొట్టెలను మార్చుకుంటోంది. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన వారి గురించి వాకబు చేస్తూ, వారి నుంచి రొట్టెను స్వీకరించేందుకు యువతీ యువకులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశీ రొట్టెతో పాటు సంతాన, ఉద్యోగ రొట్టెలకు కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది.

తాము కోరుకున్న కోరికలు తీరిన తరువాత, దర్గాకు వచ్చే భక్తులు, అదే కోరికలతో వచ్చే భక్తులతో రొట్టెలను మార్చుకోవడం ఈ దర్గా ఆనవాయతీ. వ్యాపార, సంతాన, ఆరోగ్య, ఉద్యోగ, విద్య, పెళ్లి, సౌభాగ్య తదితర సంప్రదాయ రొట్టెలు ప్రతియేటా కనిపిస్తుంటాయి. ఇక ప్రజా ప్రతినిధులు తమ ప్రచారం కోసం దర్గాకు వెళ్లే మార్గాల్లో టెంట్లు, గుడారాలు వేసి భక్తులకు మంచినీరు, మజ్జిగ తదితరాలను అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి రొట్టెలతో పాటు, గత సంవత్సరం పరిచయం చేసిన అమరావతి రొట్టెలను పంచుతున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News