us: పాకిస్థాన్, ఖతార్, టర్కీ ఉగ్రదేశాలే... కీలక ప్రకటన చేయనున్న అమెరికా!

  • అతి త్వరలోనే ప్రకటించేందుకు అమెరికా సిద్ధం
  • వెల్లడించిన పెంటగాన్ మాజీ అధికారి
  • యూఎస్ డబ్బుతో ఉగ్రమూకలను పెంచిన పాకిస్థాన్
  • 1979 నుంచి భారత్ చేస్తున్న డిమాండ్ కు ఇప్పుడు మద్దతు

ఇప్పటికే పాకిస్థాన్ కు అందించాల్సిన ధన సహాయాన్ని నిలిపివేసి, ఉగ్రవాద సంస్థలను ఏరిపారేసేంత వరకూ ఆంక్షలు విధించాలని నిర్ణయించి ఒత్తిడి పెంచుతూ వస్తున్న అమెరికా ప్రభుత్వం, మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్ తో పాటు ఖతార్, టర్కీ దేశాలను ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న దేశాల జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ విషయాన్ని 'ది వాషింగ్టన్ ఎగ్జామినర్' పత్రికకు రాసిన ఓ వ్యాసంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వెల్లడించారు. పాకిస్థాన్ ఖాతాను మూసేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డ ఆయన, ఆంక్షల నుంచి ఆ దేశం బయట పడాలంటే, తమ భూ భాగంపై ఉగ్రమూలాలు లేకుండా చేసుకోవాలని, వారికి నిధులివ్వడాన్ని పూర్తిగా నిలిపివేయాల్సి వుంటుందని ఆయన సూచించారు.

 కాగా, 1979 నుంచి భారత విదేశీ వ్యవహారాల శాఖ, పాక్ ను ఉగ్రదేశంగా గుర్తించాలని అమెరికాను కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లిబియా, ఇరాక్, సౌత్ యమన్, సిరియా, క్యూబా, ఇరాన్, సూడాన్, నార్త్ కొరియా దేశాలు ఉగ్రవాద దేశాలని అమెరికా ప్రకటించింది. ఈ దేశాలన్నీ అంతర్జాతీయ ఉగ్ర సంస్థలకు నిధులను అందిస్తున్నాయని ఆరోపించింది కూడా. వీటిల్లో ఇరాన్, సిరియా, సూడాన్ లు పూర్తి ఉగ్రదేశాలని రూబిన్ పేర్కొన్నారు.

ఉగ్ర కార్యకలాపాలను నిలువరించకుంటే, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. తాజాగా ఉగ్ర జాబితాలోకి చేరనున్న ఈ మూడు దేశాలూ ఎంతో కాలంగా ఉగ్ర సంస్థలకు సహాయం చేస్తూ వస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని ఎంతగా ఒత్తిడి తెస్తున్నా వినడం లేదని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ దారిని మరల్చాలని అమెరికా ఎంతో సంయమనంతో చూసిందని, ఇక తమ ప్రయత్నాలు విఫలమైనందునే కీలక చర్యలకు వైట్ హౌస్ ఉపక్రమించేందుకు సిద్ధమైందని ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా, అమెరికా నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం ప్రకారం, పాక్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) బహిరంగంగానే తాలిబాన్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు మద్దతిస్తోంది. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో బాంబులను అమర్చిన జైషే మొహమ్మద్, 2001లో భారత పార్లమెంటుపై, ఆపై 2008లో ముంబైలో జరిగిన మారణకాండకు కారణమైన లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు పాక్ నిధులిస్తోంది. ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న ఈ సంస్థలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా యూఎస్ అడుగులు వేయనుందని, అమెరికా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను సంక్షేమం పేరిట తీసుకుని, వాటిని ఉగ్ర వ్యాప్తికి వాడటమే పాక్ చేసిన అతిపెద్ద తప్పని ఈ సందర్భంగా రూబిన్ ఆరోపించారు.

More Telugu News