telangana: నేటి నుంచి మందుబాబులకు మరింత పండగ... టీఎస్ లో కొత్త మద్యం విధానం అమలులోకి!

  • ఉదయం 10 గంటలకే తెరచుకోనున్న దుకాణాలు
  • రాత్రి 11 గంటల వరకూ విక్రయాలకు అనుమతి
  • రేపు గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపుల మూత

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా, ఉదయం 10 గంటలకే వైన్ షాపులు తెరచుకునే వీలు దుకాణదారులకు లభించనుంది. రాత్రి 11 గంటల వరకూ మద్యం విక్రయాలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగుతుండగా, మరింత ఆదాయంపై కన్నేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ, వైన్స్ విక్రయాల అవధిని మరో రెండు గంటలు పెంచింది.

ఇటీవల ముగిసిన షాపుల విక్రయాల లాటరీ తరువాత కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారు, ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేసి, తమ దుకాణాలను తెరుస్తున్నారు. ఇంకా పలు కొత్త షాపులకు సరకు బట్వాడా జరగలేదని తెలుస్తోంది. నూతన విధానం ప్రజలను మరింతగా మందుకు బానిసలను చేసేలా ఉందని విపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, తాజా వేలంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాలు, ప్రాంతాల్లోని మద్యం షాపులకు డిమాండ్ అధికంగా వచ్చింది. కోదాడ, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో షాపులను దక్కించుకునేందుకు పోటీపడి ఎంతో మంది లక్షలాది రూపాయలను కోల్పోయారు. దరఖాస్తుకు రూ. లక్ష చొప్పున వసూలు చేసిన ఎక్సైజ్ శాఖ, డ్రా తరువాత షాపు దక్కకుంటే, ఆ డబ్బు తిరిగి ఇచ్చేది లేదని ముందే స్పష్టంగా వెల్లడించింది. దీంతో ఎలాగైనా షాపులు తమకు దక్కాలని ఒక్కొక్కరు ఐదు నుంచి పది వరకూ దరఖాస్తులు పెట్టుకున్నారు. కాగా, రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

More Telugu News