ys jagan: నిన్న రెండు గంటల పాటు మాయమైన వైఎస్ జగన్.. ఎక్కడికి వెళ్లారో తెలిసిపోయింది!

  • బీజేపీ నేత ఇంటికి వెళ్లి చర్చలు
  • సెక్యూరిటీ లేకుండా సొంత వాహనంలోనే
  • దుర్గాష్టమి నాడు ముఖ్యమైన పనిని ప్రారంభించిన జగన్
  • బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం!

దసరా నవరాత్రుల్లో మంచి రోజుగా భావించే దుర్గాష్టమి రోజున వైకాపా అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం నాడు అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు.

ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా, ఇంట్లో లేకుండా, భద్రతా సిబ్బందికి తెలియకుండా, వ్యక్తిగత వాహనంలో బయటకు వెళ్లిపోయారు. దాదాపు రెండున్నర గంటల తరువాత వెనక్కు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయమై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగగా, మధ్యాహ్నం భోజనం తరువాత ఆయన ఓ ప్రముఖ బీజేపీ నేత కుమారుడి ఇంటికి వెళ్లి, అక్కడికి ముందే చేరుకున్న ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలతో సమావేశమై చర్చలు సాగించినట్టు తెలుస్తోంది.
 
హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ బీజేపీ లోక్ సభ సభ్యుడి తనయుడి ఇంటికి వెళ్లిన జగన్, బీజేపీకి దగ్గరయ్యే వ్యూహంతో, ఆ పనిని శుభదినమైన దుర్గాష్టమి నాడు ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కోరినన్ని సీట్లను ఇస్తామన్న సంకేతాలను పంపడంతో పాటు, పాదయాత్ర తలపెట్టిన తనకు కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు లభించేందుకు కేంద్రం సహకరించాలని కూడా కోరినట్టు సమాచారం.

ఈ భేటీపై అధికారిక సమాచారం లేకపోయినా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు తాను సహకరించానన్న విషయాన్ని గుర్తు చేసిన జగన్, తదుపరి ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసే విషయమై పలువురు నేతలతో రెండు గంటల పాటు సమావేశమై మాట్లాడినట్టు తెలుస్తోంది.

More Telugu News