zealandia: భూమిపై 8 ఖండాలు ఉండేవి.. ఆ ఖండం సముద్రంలో మునిగిపోయింది!

  • భూమి మీద ఎనిమిదో ఖండం జిలాండియా
  • 100 మిలియన్‌ సంవత్సరాల కిందట కలిసి ఉన్న ఆస్ట్రేలియా, అంటార్కిటికా, జిలాండియా భూభాగాలు 
  • సముద్రంలో సమాధైన జిలాండియా
  • సముద్ర మట్టానికి 3,280 అడుగుల లోతున జిలాండియా

భూమి ఏడు ఖండాలుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అయితే భూమిపై ఎనిమిదో ఖండం కూడా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది సుమారు 60 లక్షల ఏళ్ల క్రిందట వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో సమాధి అయిపోయిందని చెబుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్యలో సముద్రాన్ని శోధిస్తుండగా ఈ ఎనిమిదో ఖండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని జిలాండియా ఖండంగా వారు పేర్కొంటున్నారు. భౌగోళిక మార్పులు, సునామీలు, భూకంపాల మూలంగా ఈ ప్రాంతం సముద్రంలో మునిగి పోయి ఉండొచ్చని మహాసముద్రాలపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ జామీ అలెన్‌ చెబుతున్నారు.

 సుమారు 100 మిలియన్‌ సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా, అంటార్కిటికా, జిలాండియా భూభాగాలు కలిసి భూమి మీద అతి పెద్ద ఖండంగా ఉండేదని ఆయన వెల్లడించారు. ఈ జిలాండియా ఖండం ఆస్ట్రేలియాకు తూర్పుతీరంలో ప్రస్తుత న్యూజిలాండ్‌ తో కలిసి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 3,280 అడుగుల లోతు నీళ్లలో సమాధై ఉందని ఆయన అన్నారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేస్తే మానవ మనుగడ, ఉన్నతికి సంబంధించిన అనేక విషయాలు, విశేషాలు వెలుగుచూసే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిలాండియాలో సుమారు 8 వేల రకాల జాతుల శిలాజాలు, విభిన్నరకాల శిలాకృతులు ఉన్నాయని ఆయన తెలిపారు. 

More Telugu News