three year girl: మూడేళ్ల పాప‌ను త‌మ దేవ‌త‌గా ఎంచుకున్న నేపాలీలు!

  • ఎంపిక కోసం క‌ఠిన ప‌రీక్ష‌లు
  • 400 ఏళ్ల సంప్ర‌దాయంలో భాగం
  • `కుమారి` దేవ‌త‌గా ప‌న్నెండేళ్లు పూజ‌లు


నాలుగు వంద‌ల ఏళ్లుగా పాటిస్తున్న సంప్ర‌దాయంలో భాగంగా త‌మ కొత్త `కుమారి` దేవ‌త‌ను నేపాలీలు ఎంచుకున్నారు. అతీంద్రయ‌ శ‌క్తులు గ‌ల అమ్మ‌వారిగా బిజ‌య ర‌త్న‌, సృజ‌నా శ‌క్య‌ల మూడేళ్ల‌ కుమార్తె త్రిష్ణ శ‌క్య‌ను ఎంపిక చేశారు. `శ‌క్య‌` జాతికి చెందిన మ‌రో ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌తో క‌ఠిన ప‌రీక్ష‌ల్లో పోటీప‌డి త్రిష్ణ శ‌క్య కుమారి దేవ‌త‌గా గెలిచింది. ఈ కొత్త కుమారి దేవ‌త‌ను త్వ‌ర‌లో నేపాల్ అధ్య‌క్షురాలు బిద్యా దేవి భండారీకి ప‌రిచ‌యం చేయ‌నున్నారు. త‌ర్వాత ఆమెను కుమారి దేవ‌త నివాస స్థ‌లమైన `కుమారి ఘ‌ర్‌`కి చేరుస్తారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కుమారి దేవ‌త‌గా ఉన్న మ‌ణితా శ‌క్య స్థానంలో త్రిష్ణ శ‌క్య‌కు నేపాలీలు ప‌న్నెండేళ్ల‌పాటు పూజ‌లు చేస్తారు. శ‌క్తిమంత‌మైన గ్ర‌హాలు కూట‌మిగా ఉన్న‌పుడు, శ‌రీరం మీద ఎలాంటి మ‌చ్చ‌లు లేకుండా జ‌న్మించిన ఆడ‌పిల్లలు కుమారి దేవ‌త స్థానం కోసం పోటీప‌డ‌తారు. వారిలో ఒక‌రిని న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో ఎనిమిదో రోజైన కాళ‌రాత్రి రోజున కుమారి దేవ‌త‌గా ఎంపిక చేస్తారు. మ‌హార్న‌వ‌మి రోజున‌ నేపాల్ రాజుల ర‌క్ష‌కురాలిగా కొలిచే త‌లేజు భ‌వానీ అమ్మ‌వారికి కుమారి దేవ‌త పూజ‌లు చేయాలి. అప్పుడు అమ్మ‌వారి శ‌క్తుల‌న్నీ కుమారి దేవ‌త శ‌రీరంలోకి వ‌స్తాయ‌ని నేపాలీలు న‌మ్ముతారు.

More Telugu News