క్రికెట్: బెంగళూరు వన్డేలో చెప్పింది చెప్పినట్లు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్

  • 100వ వ‌న్డేలో 100 పరుగులు చేసిన మొట్టమొదటి ఆసీస్ ఆటగాడు వార్నర్
  • ఈ రోజు బాగా ఆడతానని మీడియాతో చెప్పిన వార్నర్
  • వ‌న్డేల్లో వార్న‌ర్‌కి ఇది 14 వ సెంచ‌రీ

ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్, ఓపెన‌ర్‌ డేవిడ్ వార్నర్ ఈ రోజు 100వ వ‌న్డే ఆడాడు. నేటి మ్యాచ్ గురించి ఆయ‌న‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను కోల్పోవడం తమను చాలా బాధించిందని చెప్పిన విష‌యం తెలిసిందే. నాలుగో వన్డేను మాత్రం ఛాలెంజ్ గా తీసుకుని ఆడ‌తామ‌ని, జట్టు విజయం కోసం పాటుపడతామని అన్నాడు. త‌న 100వ వ‌న్డేలో స‌త్తా చూపిస్తాన‌ని వ్యాఖ్యానించాడు.

ఈ రోజు 334 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ బ‌లంగా ఉన్న‌ భార‌త్‌పై ఆ జ‌ట్టు గెలుస్తుందో లేదో కానీ, వార్న‌ర్ తాను చెప్పిన మాట‌ను మాత్రం అక్ష‌రాలా నిజం చేసి చూపించాడు. ధాటిగా ఆడి త‌న 100వ వ‌న్డేలో సెంచ‌రీ బాదాడు. వార్న‌ర్ త‌ద్వారా ఓ రికార్డును కూడా నెల‌కొల్పాడు. 100వ వ‌న్డేలో 100 ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్న‌ర్ మొద‌టివాడు.

వ‌న్డేల్లో వార్న‌ర్‌కి ఇది 14 వ సెంచ‌రీ. 10 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఆయ‌న సాధించిన ఈ సెంచ‌రీ ఆయ‌న‌కు ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. కాగా, గతంలో తాము ఆడుతోన్న‌ 100వ వ‌న్డేలో సెంచరీ బాదిన ఇత‌ర ఆట‌గాళ్ల వివ‌రాలు చూస్తే... క్రిస్ క‌యిర్న్స్‌, మొహ‌మ్మ‌ద్ యూస‌ఫ్‌, కుమార్ సంగ‌క్క‌ర‌, క్రిస్‌గేల్‌, మార్క‌స్, రామ్ న‌రేశ్ శ‌ర్వాన్ ఉన్నారు.  

More Telugu News