ajay devagan: అమితాబ్, ఐశ్వర్య, అజయ్ దేవగణ్ లకు ఈడీ సమన్లు!

  • పనామా పేపర్స్ లో వీరి పేర్లు
  • గతంలో పంపిన నోటీసులకు సమాధానం ఇచ్చిన బచ్చన్ ఫ్యామిలీ
  • చట్ట విరుద్ధమైన పనులు చేయలేదని వెల్లడి
  • మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు కదలనున్న ఈడీ

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు, అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యా రాయ్ తో పాటు హీరో అజయ్ దేవగణ్ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సమన్లు జారీ చేసి, ఆపై వీరిని ప్రశ్నించాలన్నది ఈడీ ప్లాన్ గా వుందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ లీకేజీ దస్త్రాల్లో వీరి పేర్లు ఉండటం, వీరు నిబంధనలకు విరుద్ధంగా బెహ్రయిన్ తదితర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు రావడం తెలిసిందే.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బచ్చన్ కుటుంబం ఈడీ తొలి నోటీసులకు సమాధానం ఇస్తూ, తాము ఎటువంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకూ పాల్పడలేదని వివరణ ఇచ్చారు. వాటిని అందుకున్న రెండు రోజుల్లోనే మరో నోటీసు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. 2004 నుంచి వీరు విదేశాల్లో జరిపిన అన్ని లావాదేవీల వివరాలనూ ఇవ్వాలని ఈడీ తొలుత ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించింది.

కాగా, వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు చెందిన మొత్తం 1.15 కోట్ల దస్త్రాలు పనామా పేపర్స్ లో భాగంగా లీక్ అయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లోని 2.14 లక్షలకు పైగా కంపెనీల్లో 1970 నుంచి పెట్టుబడులు పెట్టిన వారి వివరాలను 2015లో కార్పొరేట్ కంపెనీలకు న్యాయ సేవలందించే మోస్సాక్ ఫోన్సెకా నుంచి తస్కరించి వీటిని బయటకు చూపారు. ఈ పేపర్స్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు కూడా ఉండటంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

More Telugu News