Men can also be raped: అత్యాచారానికి గురయ్యే మగాళ్ల సంగతేంటి?: 'పిల్' విషయంలో కేంద్రం అభిప్రాయాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు

  • ఐపీసీ సెక్షన్ 375, 376లను సవరించాలి
  • దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ మొదలు
  • అత్యాచార బాధితుల్లో పురుషులూ ఉన్నారన్న పిటిషనర్
  • వచ్చే నెల 23కు కేసు విచారణ వాయిదా

కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్లలోనూ అత్యాచార బాధితులు ఉంటారని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి తన అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ కేసులో కేంద్రం అభిప్రాయాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 375, 376లను సవరించే దిశగా అడుగులు పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఓ పిటిషన్ దాఖలు చేస్తూ, అత్యాచార కేసుల్లో కేవలం మహిళలనే బాధితులుగా చూస్తున్నారని, ఈ విషయంలో చట్టాల్లోనే లింగ వివక్ష ఉందని, పురుషుల్లో కూడా అత్యాచార బాధితులు ఉన్నారని పేర్కొనగా, దీన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరి శంకర్ లతో కూడిన బెంచ్ కేంద్రానికి నోటీసులు పంపింది.

తన పిటిషన్ లో ఎంతో మంది పురుషులు కూడా అత్యాచారానికి గురవుతున్నారని, వారంతా బయటకు రాకపోవడానికి పితృస్వామ్య భావన కూడా కారణమని చెప్పుకొచ్చారు. అయితే, మహిళలతో పోలిస్తే, పురుషులపై అత్యాచారాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ, వాటిని కూడా చట్టం మరువరాదని వాదించారు. ఒకవేళ, తనపై అత్యాచారం జరిగిందని ఎవరైనా పురుషుడు ఫిర్యాదు చేస్తే, అతన్ని 'నిజమైన మగాడు'గా సమాజం పరిగణించడం లేదని తన పిటిషన్ లో తెలిపాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో ఉన్న సమానత్వ హక్కును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు. దీనిపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు ఇస్తూ, కేసును అక్టోబర్ 23కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.

More Telugu News