gst: ఆగ‌స్టు నెల జీఎస్టీ వ‌సూలు రూ. 90,669 కోట్లు... వెల్ల‌డించిన ప్ర‌భుత్వం

  • జూలై నెల కంటే త‌క్కువ వ‌సూళ్లు
  • ఎక్కువ వ‌సూళ్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచే
  • స‌వ‌ర‌ణ‌లు చేస్తే లెక్క‌లు పెరిగే అవ‌కాశం

వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) అమ‌ల్లోకి వ‌చ్చాక రెండో నెల అయిన ఆగ‌స్టులో వ‌సూలైన‌ జీఎస్టీ వివ‌రాల‌ను కేంద్రం వెల్ల‌డించింది. కంపోజిష‌న్ ప‌థ‌కం అమ‌ల్లో ఉన్న 10.24 ల‌క్ష‌ల మంది చెల్లించిన జీఎస్టీని మిన‌హాయించ‌గా రూ. 90,669 కోట్లు వ‌సూలు అయిన‌ట్లు పేర్కొంది. సెప్టెంబ‌ర్ 25, 2017 వ‌ర‌కు సెంట్ర‌ల్ జీఎస్టీ ద్వారా రూ. 14,402 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ. 21,067 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ. 47,377 కోట్లు, ల‌గ్జ‌రీ స‌రుకుల మీద విధించిన సెస్‌ల ద్వారా రూ. 7,823 కోట్లు వ‌సూలైన‌ట్లు తెలియ‌జేసింది.

 జూలై నెల‌తో పోల్చిన‌పుడు ప్రాథ‌మిక జీఎస్టీ వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. జూలైలో ప్రాథ‌మికంగా రూ. 92,283 కోట్ల జీఎస్టీ ప‌న్ను వ‌సూలు కాగా, స‌వ‌ర‌ణ‌ల అనంత‌రం రూ. 94,063 కోట్ల‌కు పెరిగింది. ఆగ‌స్టు లెక్క‌ల‌కు కూడా స‌వ‌ర‌ణ‌లు చేస్తే జీఎస్టీ ప‌న్ను వ‌సూలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌నలో ఉంది. జీఎస్టీ రిట‌ర్న్ స‌కాలంలో ఫైల్ చేయ‌ని కార‌ణంగా ఈ స‌వ‌ర‌ణ‌లు చేయాల్సి వ‌స్తోంది. ఆగ‌స్టు నెల‌కు గాను జీఎస్టీ రిట‌ర్న్ సెప్టెంబ‌ర్ 20లోగా చెల్లించాలి. కానీ చాలా మంది చెల్లింపులో జాప్యం చేస్తున్న కార‌ణంగా పూర్తి స్థాయి వ‌సూళ్లు గ‌ణించ‌డం క‌ష్టంగా మారుతోంది.

More Telugu News