operation arjun: బీఎస్ఎఫ్ కొత్త 'ఆపరేషన్ అర్జున్'... పాక్ కు షాకిస్తున్న ప్లాన్ వివరాలివి!

  • 'ఆపరేషన్ అర్జున్' దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్
  • సరిహద్దుల్లో మాజీ సైనికులు, జవాన్లే లక్ష్యంగా భారత్ దాడులు
  • రెండుసార్లు బీఎస్ఎఫ్ చీఫ్ తో చర్చించిన పాక్ డీజీ
  • దాడులు ఆపాలని వినతి - ముందు మీరే ఆ పని చేయాలని సూచించిన ఇండియా

సరిహద్దుల్లో నిత్యమూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తుపాకుల తూటాల చప్పుళ్లతో రెచ్చిపోతూ, వీలైనప్పుడల్లా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి విరుచుకుపడుతున్న పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ నేమ్ 'ఆపరేషన్ అర్జున్'. భారత జవాన్లను హతమార్చేందుకు స్నిప్పర్లను వాడుతూ, సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులతో విరుచుకుపడుతూ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ వైఖరికి అడ్డుకట్టగా 'ఆపరేషన్ అర్జున్'ను సరిహద్దు భద్రతా దళాలు చేపట్టాయి.

ఇందులో భాగంగా సరిహద్దులకు దగ్గరగా పాక్ వైపు నివాసాలు ఏర్పరచుకున్న రిటైర్డ్ సైనికులు, ఐఎస్ఐ, పాక్ రేంజర్ల నివాసాలు, వారి భూములను టార్గెట్ చేయనుంది. గతంలో సరిహద్దుల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహించి, ఆపై పదవీ విరమణ చేసిన సైనికులకు అక్కడికి దగ్గర్లోనే భూములు, ఇళ్లు ఇస్తున్న పాక్ ప్రభుత్వం వారి సేవలను మరో రకంగా వినియోగించుకుంటోంది. వారు ఇచ్చే సమాచారంతోనే యువ ఉగ్రవాదులు సులువుగా భారత్ లోకి చొచ్చుకు వస్తున్న పరిస్థితి నెలకొందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పొలాల్లో పని చేస్తున్న రైతుల్లా నటిస్తూ, భారత్ వైపు జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించే వీరు, ఆ సమాచారాన్ని సైనికాధికారులతో పంచుకుంటున్నారు. వీరిని నిలువరించాలన్న ప్రయత్నంలో భాగంగానే అర్జునాస్త్రాన్ని ఇండియా బయటకు తీసింది. గత కొద్ది రోజులుగా సరిహద్దుల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇక తాము సరిహద్దుల్లో ఉండలేమని చెబుతూ పాక్ రిటైర్డ్ అధికారులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డ పాకిస్థాన్ కాళ్ల బేరానికి దిగింది. బీఎస్ఎఫ్ చర్యలు ఆపాలని కోరుతూ పాకిస్థాన్ రేంజర్స్ పంజాబ్ డీజీ మేజర్ జనరల్ అజర్ నవీద్ హయత్ ఖాన్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ కేకే శర్మతో రెండు సార్లు చర్చలు జరిపారు. సరిహద్దుల వెంట ఫైరింగ్ ఆపాలని ఆయన కోరగా, పాక్ వైఖరిని శర్మ బహిరంగంగానే ఎండగట్టారు.

తొలుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించి, ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించకుండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పాక్ స్పందన బట్టి తమ నిర్ణయం ఉంటుందని తెలిపారు. గత నెల 22న ఒకసారి, తిరిగి గత సోమవారం మరోసారి వీరిద్దరి మధ్యా చర్చలు జరుగగా, భారత వ్యూహం గురించి తెలుసుకుని ఆ దేశం దిగివచ్చిందని, ఇక మరింత ఒత్తిడి పెంచుతామని సైనికాధికారులు వెల్లడించారు.

కాగా గత కొద్ది రోజుల వ్యవధిలో సుదూరంలోని లక్ష్యాలను సులువుగా చేరుకోగల లాంగ్ రేంజ్ 81 ఎంఎం ఆయుధాలను వాడుతున్న భారత జవాన్లు సరిహద్దులకు ఆవల ఉన్న పాకిస్థాన్ బంకర్లను, సైనికుల స్థావరాలను, పలువురు పదవీ విరమణ చేసిన అధికారుల నివాసాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. పాక్ మన గ్రామాలపై కాల్పులు జరుపుతూ ఉంటే, తాము మాత్రం పాక్ గ్రామస్తుల జోలికి పోవడం లేదని, సమస్యలకు కారణమవుతున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News