darjeeling: రాజ్ నాథ్ చెప్పిన మాటలు విని 104 రోజుల నిరసనకు స్వస్తి చెప్పిన డార్జిలింగ్!

  • బంద్ ను విరమించాలని సూచించిన హోమ్ మంత్రి
  • చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పిలుపు
  • సరేనన్న గూర్ఖా ముక్తి మోర్చా చీఫ్ బిమల్ గురాంగ్
  • ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ

గూర్ఖాల్యాండ్ రాష్ట్రం కోసం 104 రోజులుగా జరుగుతున్న నిరవధిక నిరసనలు ముగిశాయి. కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన విజ్ఞప్తి మేరకు బంద్ ను ముగిస్తున్నట్టు గూర్ఖా ముక్తి మోర్చా చీఫ్ బిమల్ గురాంగ్ వెల్లడించారు. ఈ ఉదయం 6 గంటల నుంచి నిరసనలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు సీనియర్ నేతలతో చర్చించామని, రాజ్ నాథ్ చెప్పిన మాటలను తాము విశ్వసిస్తున్నామని అన్నారు.

కాగా, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నాడు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన మార్గాల్లో నిరసనలు వీడి చర్చలకు రావాలని ఆయన పిలుపునివ్వగా, దీనిపై జీజేఎం చర్చించి నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ ప్రారంభం కావడంతోనే ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గురాంగ్ డిమాండ్ చేశారు.

కాగా, నిరసనలకు జీజేఎం స్వస్తి పలకడంతో, మూడున్నర నెలలుగా మూతపడిన డార్జిలింగ్ వ్యాపార సంస్థలు తమ కార్యాలయాలను, దుకాణాలనూ ఈ ఉదయం తెరిచాయి. ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News