honeypreet: నన్ను చంపేస్తారు... దయచేసి బెయిలివ్వండి: కోర్టును వేడుకున్న హనీప్రీత్ సింగ్

  • చెయ్యని తప్పుకు ఇరికిస్తున్నారు
  • విచారణకు సహకరిస్తాను
  • భారత చట్టాలపై నమ్మకం ఉంది
  • తాను ఎక్కడికీ పారిపోలేదన్న హనీప్రీత్

తనకు ప్రాణభయం ఉందని, ఎక్కడ, ఎవరు చంపేస్తారోనన్న ఆందోళనలో ఉన్నానని, చెయ్యని తప్పుకు తనను ఇరికించాలని చూస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గుర్మీత్ దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేటి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కోర్టు విచారణ చేబడుతుంది. ఇక తాను దాఖలు చేసిన పిటిషన్ లో పలు విషయాలను హనీప్రీత్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

తనకు బెయిల్ ఇస్తే, ఎక్కడికీ పారిపోబోనని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చింది. తనకు భారత చట్టాలపై నమ్మకం ఉందని, తానే తప్పూ చేయలేదని వాపోయింది. సిర్సా, పంచకుల ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపింది. జైలుకు వెళ్లి తాను గుర్మీత్ రామ్ రహీమ్ ను కలవలేదని చెప్పింది. తాను నేపాల్ కు పారిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఎక్కడ తనను చంపేస్తారోనన్న భయంతో దాగుండి పోయానని చెప్పింది. కాగా, ఈ పిటిషన్ పై విచారణ జరిగే సమయానికి తాము కూడా కోర్టులో ఉండాలని భావిస్తున్న సిట్ అధికారులు సైతం హైకోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News