India: భారత్, అమెరికా కలిసి పాకిస్థాన్‌ అణ్వాయుధాలపై దాడులు చేయాల్సిందే: అమెరికా మాజీ సెనేటర్

  • ట్రంప్ తన సూచనను పరిగణనలోకి తీసుకుంటారన్న లారీ ప్రెస్లర్
  • పెంటగాన్ అండతోనే పాక్‌ రెచ్చిపోతోందని వ్యాఖ్య
  • ఇరు దేశాలను ఒకేలా చూడొద్దని ట్రంప్‌కు  సూచన

అమెరికా, భారత్‌లు కలిసి పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలను ధ్వంసం చేసేందుకు ముందస్తు దాడులు చేయాల్సిందేనని అమెరికా మాజీ సెనేటర్ లారీ ప్రెస్లెర్ సూచించారు. పాకిస్థాన్‌లో అణ్వాయుధాలు దాచి ఉంచిన ప్రదేశాలు, తయారుచేస్తున్న ప్రదేశాలపై ఇరు దేశాలు దాడులు చేయాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని ఆ దేశానికి హుకుం జారీ చేయడం ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్ అత్యుత్తమ అధ్యక్షుడిగా పరిగణించే అవకాశం ఉందన్నారు.

పాకిస్థాన్‌కు పెంటగాన్ మద్దతు ఉండడంతో ట్రంప్ తొలుత అటువైపు నుంచి నరుక్కు రావాల్సి ఉంటుందన్నారు. పెంటగాన్ అండతోనే భారత్‌పై దాడి చేయాలన్న ధైర్యం పాకిస్థాన్‌కు వచ్చిందన్నారు. ట్రంప్ తన సూచనను పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు లారీ ప్రెస్లెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను అమెరికా ఉగ్రవాద దేశంగా తప్పక ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు. ఆ దేశానికి అందిస్తున్న సాయాన్ని నిలిపివేయాలని, భారత్, పాకిస్థాన్‌లను ఒకేలా చూడరాదని ఆయన సూచించారు. ఇండియా ప్రజాస్వామ్య దేశమని, పాకిస్థాన్ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన కొనియాడారు.

More Telugu News