bjp: మాతో కలిసుండాలని చంద్రబాబే అనుకోవడం లేదు: బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు

  • జగన్ మద్దతిస్తే, అనుమానపడితే ఎలా?
  • మేము ఎవరినీ కొనుగోలు చేయడం లేదు
  • రజనీకాంత్ తో చర్చలు సాగుతున్నాయి
  • కేసీఆర్ పై సుశీల్ కుమార్ పొగడ్తలు మర్యాద పూర్వకమే

భారతీయ జనతా పార్టీతో కలసి నడవాలని తెలుగుదేశం పార్టీ భావించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన మనసులోని భావాలను పంచుకున్నారు. తమతో కలిసుండాలని చంద్రబాబునాయుడు భావించడం లేదని ఆయన తెలిపారు. వైకాపా అధినేత వైఎస్ జగన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన కారణంగా టీడీపీ వాళ్లు అనుమానిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఎవరినీ కొనుగోలు చేయట్లేదని, మోదీ చరిష్మా చూసి వారంతట వారే వచ్చి చేరుతున్నారని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పాలన, అమలు చేస్తున్న పథకాలపై సుశీల్ కుమార్ పొగడ్తలను ప్రస్తావిస్తూ, ఆయన అతిథిగా వచ్చి మర్యాదగా ఓ మాటని వెళ్లారని, పాలనపై సర్టిఫికెట్ ఇచ్చేది అమిత్ షాయేనని, ఆయన కేసీఆర్ పాలనపై చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి వున్నామని అన్నారు. హైదరాబాద్ తమకు బలమైన కోటని, కొన్ని కారణాలవల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవలేదని చెప్పిన మురళీధర్ రావు, ఒకప్పుడు కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోందని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.

ఇక రజనీకాంత్ సొంత పార్టీ పెడతారా? లేక బీజేపీతో కలసి నడుస్తారా? అన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని, తాము మాత్రం ఆయనతో సత్సంబంధాలనే కోరుతున్నామని, ఆయనతో చర్చలు సాగుతున్నాయని అన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఏడేడు జన్మల బంధంలా ఉండవని, టీడీపీతో తమ బంధమూ అంతేనని చెప్పారు. రెండు వేర్వేరు పార్టీలుగా ఎవరి లక్ష్యాలు వాళ్లకు ఉన్నాయని, మంచిగా ప్రయాణం సాగి, ఒకరి కారణంగా మరొకరు నష్టపోనంతవరకూ పొత్తు కొనసాగుతుందని అన్నారు. తెలుగుదేశం కారణంగా ఏపీలో బీజేపీ ఎదగదేమోనన్న ఆందోళన తమకు లేదని స్పష్టం చేశారు.

More Telugu News