BJP MLA: ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి.. బాధితుడిని వీపుపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన వైనం!

  • ప్రమాదంలో గాయపడిన వారికి సపర్యలు
  • తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి
  • బాధితుడిని స్వయంగా భుజాలపైకి ఎక్కించుకుని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లిన వైనం
  • సర్వత్రా ప్రశంసలు

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మేజర్ సునీల్ దత్ ద్వివేదీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజాభిమానాన్ని అంతగా దోచుకున్న ఆయన ఏం చేశారంటే..

ఫరూఖాబాద్-ఫతేగఢ్ రహదారిపై భీంసేన్ మార్కెట్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా తన కారులో ప్రయాణిస్తున్న ఫరూఖాబాద్ ఎమ్మెల్యే అయిన సర్దార్ రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను చూశారు. వెంటనే కారు దిగి వారికి సపర్యలు చేశారు. అనంతరం వారిని తన కారులోకి చేర్చి సమీపంలోని లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

తీరా అక్కడికి చేరుకున్నాక బాధితులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు సరిపడా స్ట్రెచర్లు లేవు. అందుబాటులో ఉన్న వాటి ద్వారా ఇద్దరు క్షతగాత్రులను లోపలికి తీసుకెళ్లగా మరొకరికి స్ట్రెచర్ అందుబాటలో లేకుండా పోయింది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే తన భుజాలపైకి బాధితుడిని ఎక్కించుకుని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు.

బాధితులను నాగ్లా ప్రితమ్ గ్రామానికి చెందిన అర్వింద్ సింగ్, నాగ్లాదీన్‌కు చెందిన రిషబ్, ఆవాస్ వికాస్ కాలనీకి చెందిన రామేశ్వర్ సింగ్‌లుగా గుర్తించారు. కాగా, తన భుజాలపై క్షతగాత్రుడిని మోసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసిన ఆసుపత్రిలోని రోగులు, సందర్శకులు తమను తాము నమ్మలేకపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న తర్వాత ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు. విషయం తెలిసిన పలు పార్టీల నేతలు కూడా సునీల్ దత్‌ను అభినందిస్తున్నారు.

More Telugu News