india: ఇక వన్డేల్లో మనమే నంబర్ వన్... కాపాడుకోవడంపైనే అనుమానం!

  • ఆస్ట్రేలియాపై 3-0 విజయంతో టాప్ పొజిషన్ కు
  • రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా
  • త్వరలో బంగ్లాదేశ్ తో ఆడనున్న సఫారీలు
  • తదుపరి రెండు మ్యాచ్ లూ గెలిస్తే ఇండియా స్థానం పదిలం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల క్రికెట్ సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ ల విజయంతోనే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో నంబర్ వన్ స్థానాన్నీ కైవసం చేసుకుంది. నిన్నటివరకూ 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు భారత్ ఖాతాలో 120 పాయింట్లు వచ్చి చేరాయి. ఇక ఈ స్థానాన్ని మరింతకాలం పాటు కాపాడుకోవాలంటే, ఇండియా జట్టు, ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించాల్సి వుంటుంది. ఎందుకంటే, త్వరలో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడనుంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్నసిరీస్ లో మిగతా రెండు మ్యాచ్ లనూ భారత్ ఓడిపోతే, దక్షిణాఫ్రికా జట్టు ఒక్క మ్యాచ్ లో గెలిస్తే తిరిగి టాప్ పొజిషన్ ను దక్కించుకుంటుంది. ఇక భారత్ మరొక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే, దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలవాల్సి వుంటుంది. ఒకవేళ ఇండియా రెండు మ్యాచ్ లూ గెలిస్తే మాత్రం 122 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు సఫారీలు బంగ్లాదేశ్ ను 2-1 తేడాతో ఓడించినా, 3-0 తేడాతో ఓడించినా, మన స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, రెండో ర్యాంకుతో భారత్ పర్యటనకు కు వచ్చిన ఆసీస్, ఇప్పుడు 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగతా మ్యాచ్ లు ఓడినా, గెలిచినా వారి ర్యాంక్ మారదు.

More Telugu News