US: సూడాన్ అవుట్, నార్త్ కొరియా, వెనిజులా ఇన్... మారిన యూఎస్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు

  • ప్రయాణ నిషేధ ఉత్తర్వులను సవరించుకున్న ట్రంప్ సర్కారు
  • 7 దేశాల జాబితా నుంచి సూడాన్ తొలగింపు
  • కొత్తగా ఉత్తర కొరియా, వెనిజులా, చాద్
  • ముప్పుంది కాబట్టేనన్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు తన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను సవరించుకున్నారు. తొలుత ఏడు దేశాల పౌరులపై ప్రయాణ నిషేధ ఆంక్షలు పెట్టిన ఆయన, తాజాగా ఆ జాబితా నుంచి సూడాన్ ను తొలగించారు. ఇదే సమయంలో నార్త్ కొరియా సహా, వెనిజులా, చాద్ దేశాలను కొత్తగా కలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

అమెరికా రక్షణే తన కర్తవ్యమని, తాను పేర్కొన్న దేశాల నుంచి యూఎస్ కు ముప్పు ఉందని భావిస్తుండబట్టే, ఆయా దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడం లేదని ఈ ప్రకటన విడుదలైన తరువాత ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కాగా, ఈ సంవత్సరం మార్చిలో సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమాలియా, సూడాన్, యెమెన్‌ దేశాల ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్ నిషేధం విధించగా, ఆ ఉత్తర్వుల గడువు గత గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ట్రావెల్ బ్యాన్ పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున, విచారణ ముగిసేవరకూ ప్రయాణ నిషేధాలను పొడిగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంది.

More Telugu News