nukes: అణ్వస్త్రాలను 9 ప్రాంతాల్లో దాచిన పాక్.. ఉగ్రవాదులు దొంగిలించే అవకాశం!

  • వివిధ ప్రాంతాల్లో మోహరించిన పాక్
  • ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే పెను ప్రమాదం తప్పదన్న ఎఫ్ఏఎస్
  • ప్రస్తుతం పాక్ వద్ద 140 అణ్వాయుధాలు

పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ గతవారం మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్’ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు తాము వ్యూహాత్మక అణ్వాయుధాలు సిద్ధం చేసుకున్నట్టు చెప్పారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. ఉగ్రవాదుల చేతుల్లో అవి పడే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అయితే అదంతా శుద్ధ అబద్ధం అని తేలిపోయింది.

ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తాజా నివేదిక ప్రకారం.. పాక్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలను దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో భద్రపరిచింది. వీటిని ఆర్మీ బేస్‌ల సమీపంలో భద్రపరిచినట్టు అమెరికాకు చెందిన ప్రముఖ అణ్వాయుధ నిపుణుడు హాన్స్ క్రిస్టెన్సన్ తెలిపారు. అణ్వాయుధాలను భద్రపరిచిన ప్రదేశంలో వాటిని ప్రయోగించగలిగే లాంచర్లు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

 పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తిని రోజురోజుకు పెంచుకుంటూ పోతోందని, ఇప్పటికే ఆ దేశం వద్ద 130 నుంచి 140 వరకు ఆయుధాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతున్న పాకిస్థాన్ వాటిని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తోందని, అయితే ఆ ప్రాంతాలు ఏవి అన్నవి గుర్తించడం కొంచెం కష్టమని నివేదిక వెల్లడించింది.

దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో పాక్ దాచిన అణ్వస్త్రాల గురించి ఉగ్రవాదులకు తెలిసే ఉంటుందని, అవి వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అవి కనుక ఉగ్రవాదుల చేతుల్లో పడితే వినాశనం తప్పదని హెచ్చరించింది. ప్రధాని అబ్బాసీ చెబుతున్నట్టు అవి ఏమంత సురక్షితంగా లేవని పేర్కొంది. ఉగ్రవాదులు ఇప్పటికే వాటిపై ఓ కన్నేసి ఉండొచ్చని అభిప్రాయపడింది.

More Telugu News