Hindus: రోహింగ్యా ముస్లింల అరాచకం.. 28 మంది హిందువుల ఊచకోత!

  • దారుణంగా, అత్యంత క్రూరంగా హతమార్చిన వైనం
  • మృతుల్లో మహిళలు, బాలురు 
  • రఖినేను వీడిన 30 వేల మంది హిందువులు

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ గ్రామంలో 28 మంది హిందువుల మృతదేహాలతో ఉన్న ఓ సమాధిని మయన్మార్ ఆర్మీ కనుగొంది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. రోహింగ్యాలకు పట్టున్న రఖినే జిల్లాలో ఈ దారుణం జరిగింది. రోహింగ్యా ముస్లిం మిలిటెంట్లే వీరిని హత్య చేసినట్టు చెబుతున్నారు. ముస్లింల దాడితో అక్కడి వేలాదిమంది హిందువులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆగస్టు 25న జరిగిన దాడులతో వారు తమపై కక్ష పెంచుకున్నారని, తమను లక్ష్యంగా చేసుకున్నారని హిందువులు చెబుతున్నారు.

రోహింగ్యా ముస్లింలు హత్య చేసిన 28 మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అత్యంత దారుణంగా, క్రూరంగా హతమార్చినట్టు ఆర్మీ చీఫ్ వెబ్‌సైట్ పేర్కొంది. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) గ్రూప్ వీరిని హతమార్చినట్టు తెలిపింది.

రఖినే జిల్లాలో హింస చెలరేగడంతో 4.30 లక్షల మంది రోహింగ్యాలు మయన్మార్‌ను విడిచిపెట్టారు. మయన్మార్ సైనికులు తమను చంపేస్తున్నారని, గ్రామాలకు గ్రామాలే తగలబెడుతున్నారని ఆరోపిస్తూ వీరంతా బంగ్లాదేశ్‌కు పారిపోయారు. కాగా, రఖినే జిల్లాలోని మొత్తం 30 వేల మంది హిందువులు, బుద్ధులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. రోహింగ్యాలు తమను లక్ష్యంగా చేసుకున్నందుకే తాము పారిపోతున్నట్టు వారు చెప్పడం గమనార్హం. ఇక ఆర్మీ స్వాధీనం చేసుకున్న  హిందువుల మృతదేహాల్లో 20 మహిళలవి కాగా, పదేళ్లలోపున్న ఆరుగురు బాలురు కూడా ఉన్నారు.

More Telugu News