Timex: భారతీయులు ఎటువంటి వాచీలను ఇష్టపడతారో చెప్పిన టైమెక్స్ సీఈవో

  • ఎక్కువ ముళ్లు ఉన్న వాచీలంటే వారికి చాలా ఇష్టం
  • నాది కూడా భారతీయుల అభిరుచే
  • ఈ నెలలో ఈ-కామర్స్ రంగంలోకి

భారతీయులు ఎటువంటి వాచీలు ఇష్టపడతారో ప్రముఖ వాచ్ మేకర్ టైమెక్స్ ప్రెసిడెంట్, సీఈవో తొబియాస్ రీస్-షిమిడిట్ చెప్పుకొచ్చారు. ఎక్కువ ముళ్లు ఉన్నవి, డయల్ పెద్దగా ఉన్నవి, ఎక్కువ ఫీచర్లు ఉన్నవి, ముఖ్యంగా కొంచం కష్టంగా ఉన్నవి, రంగులు ఎక్కువగా ఉన్న వాచీలంటే భారతీయులకు చాలా ఇష్టమని ఆయన వివరించారు. అమెరికా, పశ్చిమ యూరప్‌లతో పోలిస్తే డిజైన్ల విషయంలో భారతీయులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అన్నారు. టైమెక్స్ ఈ నెలలో భారత్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంను ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు.

1864లో ప్రారంభమైన టైమెక్స్ కంపెనీ భారత్‌లో 25 ఏళ్ల క్రితం తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తమకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని రీస్ తెలిపారు. భారత్‌లో తమ మార్కెట్‌ను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ నెలలోనే దేశంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంను కూడా ప్రారంభిస్తామన్నారు. భారత్‌ను రెండోసారి సందర్శించిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతీయులకు వాచీలపై ఉన్న అభిరుచి గురించి వివరించారు. తమకు ఇటలీలో 1500 సేల్ పాయింట్లు ఉండగా, భారత్‌లో మాత్రం 4 వేల పాయింట్లు ఉన్నాయన్నారు. అమెరికా, యూరప్ తర్వాత తమకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని వివరించారు. తన వరకైతే భారతీయులకు నచ్చిన డిజైన్లే తనకూ నచ్చుతాయన్నారు. పెద్ద డయల్స్ ఉన్న వాచీలంటే తనకు చాలా ఇష్టమని రీస్ తెలిపారు.

More Telugu News