srisailam: పోటెత్తుతున్న వరద... శ్రీశైలంలో ఒక్కరోజులో 15 అడుగులు పెరిగిన నీరు!

  • గత రెండు రోజులుగా కర్ణాటకలో వర్షాలు
  • కృష్ణమ్మకు మరోమారు జలకళ
  • ఇన్ ఫ్లో 1.40 లక్షల క్యూసెక్కులు
  • సీజన్ లో నాగార్జున సాగర్ కు అధిక ప్రవాహం నమోదు

కర్ణాటకలో గత రెండు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలకు కృష్ణమ్మ మరోమారు జలకళను సంతరించుకుంది. మొన్నటి వరకూ వేల క్యూసెక్కుల్లో ఉన్న వరద ప్రవాహం, లక్షల్లోకి పెరిగింది. ఆల్మట్టికి 1.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఆ మొత్తాన్నీ దిగువకు వదులుతున్నారు. ఈ ఉదయం నారాయణపూర్ కు 1.32 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 1.40 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది.

 ఇక ఈ నీరంతా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండటంతో ఒక్కరోజులోనే 15 అడుగుల మేరకు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలానికి 1,40,887 క్యూసెక్కుల నీరు వస్తోంది. కుడి ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అధికారులు 42 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. ఈ సీజన్ లో సాగర్ కు చేరుతున్న అత్యధిక నీటి ప్రవాహం ఇదే. ఇక శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 867 అడుగుల మేరకు నీరు చేరింది. జలాశయంలో నీటి నిల్వ 129 టీఎంసీలకు చేరింది.

More Telugu News