india: నేడు కొడితే కప్పు మనదే... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా!

  • బలంగా కనిపిస్తున్న టీమిండియా
  • ఇప్పటికే 2-0తో ఆధిక్యం
  • నేడు ఇండోర్ లో మూడో వన్డే
  • మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో నేడు కీలకమైన మూడో వన్డేకు ఇండోర్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, రెండు వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయిన ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఆతిథ్య బౌలర్లను ఎలా ఎదుర్కొని పరుగుల వరద పారించాలో తెలియని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు నేటి మ్యాచ్ లో భారత దూకుడును అడ్డుకోవడం సవాల్ వంటిదే.

అయితే, బౌలింగ్ పరంగా బాగా కనిపిస్తున్న టీమిండియా, బ్యాటింగ్ లోనే పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకూ సిరీస్ లో పూర్తి ఆధిపత్యాన్ని ఏ ఆటగాడూ చూపలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇంతవరకూ ఫామ్ లోకి రాలేదు. మనీష్ పాండే సైతం తన దూకుడును చూపడంలో విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో కొంత సమస్య ఉంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే, స్పిన్నర్లు చాహల్, కుల్ దీప్ లను అడ్డుకోలేకపోతుండటం ఆ జట్టు మేనేజ్ మెంట్ కు ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ భారం స్మిత్, వార్నర్ లపై మాత్రమే పడుతోంది. వీరిద్దరూ అవుట్ అయితే, ఆస్ట్రేలియా విజయం సాధించడం క్లిష్టతరమవుతోంది.

ఇక ఇండోర్ మైదానం చిన్నది కావడంతో, పరుగుల వరద ఖాయమని, 300కు పైగా స్కోర్ నమోదైనా, దాన్ని సులువుగా అందుకోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ కి వర్షం ముప్పులేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. స్పిన్నర్లకు స్వర్గధామమైన ఈ పిచ్ పై భారత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Telugu News