srilanka: 3.2 కిలోమీట‌ర్ల‌ పెళ్లి చీర మోయ‌డానికి విద్యార్థుల‌ను ఎంచుకోవ‌డంపై శ్రీలంక ప్ర‌భుత్వం సీరియ‌స్‌

  • విచార‌ణ ప్రారంభించిన నేష‌న‌ల్ చైల్డ్ ప్రొటెక్ష‌న్ అథారిటీ (ఎన్‌సీపీఏ)
  • చిన్నారుల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అంటున్న ఎన్‌సీపీఏ
  • ట్రెండ్‌గా మారకూడ‌ద‌నే చ‌ర్య‌లు

పెళ్లి వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌డంలో ప్ర‌త్యేక‌త‌లు చాటుకోవ‌డానికి నేటి యువ‌త వినూత్న ఆలోచ‌న‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీలంక‌కు చెందిన ఓ జంట త‌మ పెళ్లి కోసం 3.2 కిలోమీట‌ర్ల పొడ‌వైన పెళ్లి కూతురు చీర‌ను త‌యారు చేయించుకున్నారు. పెళ్లి రోజు ఆ చీర‌ను పెళ్లి కూతురు ధ‌రించింది. అయితే చీర రోడ్డుకి త‌గ‌ల‌కుండా ఉండేందుకు వారు 250 మంది విద్యార్థుల‌ను ఎంచుకున్నారు.

వీరంతా శ్రీలంక మ‌ధ్య ప్రావిన్సు ప్రాంత ముఖ్య‌మంత్రి శ‌ర‌త్ ఏక‌నాయ‌క నిర్వ‌హించే పాఠ‌శాల‌కు చెందినవారు. వీరి పెళ్లికి ముఖ్య‌మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. దీంతో ఆయ‌న పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థుల‌నే వారు ఎంచుకున్నారు. అయితే దీనిపై శ్రీలంక జాతీయ బాలల హ‌క్కుల సంర‌క్ష‌ణ విభాగం మండిప‌డింది.

 ఇలా ఎండ‌లో పిల్ల‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం, పాఠ‌శాల ప‌నిదినాల్లో ఇలాంటి వేడుక‌ల కోసం వారిని ఉప‌యోగించుకోవ‌డం, వారి హ‌క్కుల‌ను కాల‌రాయ‌డమేన‌ని ఆ జంట‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ ప్రారంభించింది. దీన్ని ఇలాగే వ‌దిలేస్తే ఒక ట్రెండ్‌గా మారే ప్ర‌మాదముంద‌ని, అందుకే వారిపై చ‌ర్య తీసుకుంటామ‌ని జాతీయ బాల‌ల హ‌క్కుల సంర‌క్ష‌ణ విభాగం చైర్మ‌న్ మారిని ది లివేరా తెలిపింది.

More Telugu News