ias daughter marriage: అతి నిరాడంబరంగా కూతురి వివాహం... ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారి!

  • సింపుల్ గా వుడా వైస్ ఛైర్మన్ పట్నాల బసంత్ కుమార్ కుమార్తె వివాహం
  • రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ కార్యదర్శిగా పని చేసిన బసంత్ కుమార్
  • కేవలం 16,100 రూపాయలతోనే పెళ్లి తంతు పూర్తి
  • మంగళసూత్రమే (6,000 రూపాయలు) అత్యంత ఖరీదు

"నాన్నా! నా పెళ్లి సింపుల్ గా చేస్తారంటే ఏదో మాదిరిగా చేస్తారనుకున్నాను... మరీ ఇంత సింపుల్ గానా?" అంటూ ఐఏఎస్ అధికారి పట్నాల బసంత్ కుమార్ ను ఆయన ఏకైక కుమార్తె ప్రశ్నించింది. ఆ వివరాల్లోకి వెళ్తే... వివాహమంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే గొప్ప వేడుక. జీవితలో పెను మార్పులు చోటుచేసుకునే ఆ వేడుకకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపితే, తాహతు మేరకు ఘనంగా వివాహ వేడుకను నిర్వహించేవారు మరికొందరు.

అదే ఏకైక సంతానం అయితే ఆ వేడుక అదిరిపోవాల్సిందే. అయితే విశాఖపట్టణం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ వైస్ ఛైర్మన్ గా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి పట్నాల బసంత్‌ కుమార్‌ మాత్రం తన కుమార్తె వివాహాన్ని నిరాడంబరంగా చేయడం విశేషం. కేవలం 16,100 రూపాయలతో తన కుమార్తె వివాహాన్ని ఆయన పూర్తి చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే.

ఆయన గతంలో రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ నరసింహన్‌ కార్యదర్శిగా కూడా పని చేశారు. రాధాస్వామి సత్సంగ్ విధానాలను అనుసరించే ఆయన తన ఏకైక కుమార్తె బినతి వరిశా వివాహాన్ని నిరాడంబరంగా చేయాలనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులతో చెప్పారు. నిరాడంబరం అంటే భారీ స్థాయిలో కాకుండా సాధారణంగా చేస్తారని భావించిన భార్య, కుమార్తె అందుకు సరే అన్నారు. బీడీఎస్ పూర్తి చేసిన ఆమెకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఏఎండీ కంపెనీలో చీఫ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న ప్రేమ స్వరూప్ తో వివాహం నిశ్చయించారు.

ఈ నెల 17న ఆగ్రాలోని రాధాస్వామి సత్సంగ్‌ లో వంద మందికి భోజనాలు, పెళ్లికుమార్తెకు చీర (4,500 రూపాయలు), మంగళసూత్రం(6,000 రూపాయలు), పెళ్లికుమారునికి కుర్తా, సూట్‌ (4,900 రూపాయలు) కోసం 16,100 రూపాయలు ఖర్చు చేశారు. గవర్నర్ దంపతులు కూడా వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ తంతు చూసిన బినతి వరిశా..."నాన్నా! నిరాడంబరంగా వివాహం అంటే మరీ ఇంత ఆదర్శమా?" అని తండ్రిని ప్రశ్నించింది. దీనికి ఆమె తండ్రి బసంత్‌ కుమార్‌ సమాధానమిస్తూ... "ఆదర్శంగానా? లేదమ్మా.. గవర్నర్‌, లేడీ గవర్నర్‌ స్వయంగా వచ్చి ఆశీర్వదించారంటే నీ వివాహం ఎంత ఘనంగా జరిగినట్టు?" అంటూ సమర్ధించుకున్నారు బసంత్. 

More Telugu News