kim jong un: తొలిసారి ట్రంప్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కిమ్ జాంగ్ ఉన్!

  • ట్రంప్ మానసిక రోగి
  • తగిన మూల్యం చెల్లించుకుంటాడు
  • హెచ్చరించిన కిమ్ జాంగ్ ఉన్
  • మరో హైడ్రోజన్ బాంబు పరీక్షకు నార్త్ కొరియా రెడీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మానసిక వ్యాధిగ్రస్తుడని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నార్త్ కొరియాను నాశనం చేస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, అలా జరిగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతకాలం ట్రంప్ పేరు చెప్పకుండానే విమర్శలు గుప్పిస్తూ, తన అధికార మీడియా, మంత్రులతో మాట్లాడించిన కిమ్, తొలిసారిగా డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

ట్రంప్ అరుపులపై ఎలా స్పందించాలో, ఎప్పుడు స్పందించాలో తనకు బాగా తెలుసునని అన్నారు. అమెరికా సుప్రీం కమాండ్ ప్రతినిధిగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన అందుకు ప్రతిగా విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన నోటి నుంచి ఇటువంటి మాటలు ఎలా వచ్చాయోనని వ్యాఖ్యానించిన కిమ్, ట్రంప్ ఊహించలేని విధంగా తమ స్పందన ఉంటుందని తెలిపారు. కాగా, తమ దేశం మరో హైడ్రోజన్ బాంబును పసిఫిక్ మహాసముద్రంపై పరీక్షిస్తుందని ఆ దేశ అధికారులు అంటున్నారు. కాగా, ఉత్తర కొరియాపై తాజా ఆంక్షలను విధిస్తూ అమెరికా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News