Rohingya: రోహింగ్యా ముస్లింల విషయంలో కొందరు తెగ బాధపడిపోతున్నారు: హోంమత్రి రాజ్‌నాథ్ చురకలు

  • మయన్మార్‌కు లేని బాధ ఇక్కడి వారికెందుకో?
  • రోహింగ్యాల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు భారత్‌కు ఉంది
  • ఎన్‌హెచ్ఆర్‌సీ నిర్వహించిన సమావేశంలోనే మంత్రి వ్యాఖ్యలు

మయన్మార్ నుంచి వలస వస్తున్న రోహింగ్యా ముస్లింలు శరణార్థులు కారని, అక్రమ వలసదారులని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రోహింగ్యా ముస్లింల విషయంలో జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) అనుకూల వ్యాఖ్యలు చేస్తుండడంతో స్పందించిన రాజ్‌నాథ్ ఈ మేరకు పేర్కొన్నారు. వారు శరణార్థులు ఎంతమాత్రమూ కాదని, వారంతా అక్రమ వలసదారులేనని మంత్రి పునరుద్ఘాటించారు. అంతేకాదు వారిని దేశం నుంచి పంపించి వేస్తామని నొక్కి వక్కాణించారు.

భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశమని, అక్రమ వలసదారులపై నిర్ణయం తీసుకునే హక్కు దానికి ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వారిని పంపించి వేయడమన్న విషయం అహానికి, ఘర్షణలకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. అది భారతదేశ సూత్రమని పేర్కొన్నారు. రోహింగ్యా ముస్లింలను వెనక్కి పంపిస్తున్నామని చెప్పినప్పుడు మయన్మార్ కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదని, కానీ భారత్‌లోని కొందరు మాత్రం తెగ బాధపడిపోతున్నారని, వారెందుకలా బాధపడిపోతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.

దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి పంపించి వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌హెచ్ఆర్‌సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్  సింగ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్‌హెచ్ఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్‌ గవర్నెన్స్ కార్యక్రమంలోనే రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More Telugu News