road doctor: వ‌ర్షాలు వ‌చ్చాయి... గోతులు ప‌డ్డాయి... 'రోడ్ డాక్ట‌ర్' కూడా వ‌చ్చాడు!

  • 2011 నుంచి పెన్ష‌న్ డ‌బ్బుల‌తో గోతులు బాగు చేస్తున్న హైద‌రాబాదీ
  • ఇప్ప‌టికి 1300ల గోతుల‌ను బాగు చేసిన గంగాధ‌ర్‌
  • ఆత్మ‌సంతృప్తి కోస‌మే ఈ ప్ర‌య‌త్నం

వ‌ర్షాలు ప‌డిన వెంట‌నే హైద‌రాబాద్ రోడ్ల ప‌రిస్థితిలో వ‌చ్చే మార్పుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. దారంతా గోతులు, గుంత‌లు, బుర‌ద‌తో అడుగు పెట్ట‌డానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని వాటిని పూడ్చేస‌రికి ఆ గోతులు మ‌రింత పెద్ద‌విగా మార‌తాయి. కానీ అలా మార‌కుండా ప్ర‌భుత్వం కంటే ముందే స్పందించే రోడ్ డాక్ట‌ర్ హైద్రాబాద్‌లో ఉన్నాడు.

2011 నుంచి త‌న పెన్ష‌న్ డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి సిమెంట్‌, కంక‌ర క‌లిపిన మిశ్ర‌మాన్ని త‌యారుచేసి కారులో వేసుకుని బ‌య‌ల్దేర‌తాడు క‌ట్నం గంగాధ‌ర తిల‌క్‌. దారిలో క‌నిపించిన ప్ర‌తి ఒక్క గోతిని ఆయ‌న పూడ్చుకుంటూ వెళ‌తాడు. ఇప్ప‌టివ‌ర‌కు అలా ఆయ‌న 1300ల‌కు పైగా గోతుల‌ను బాగు చేశాడు. త‌న కార్లో ఎప్పుడూ 300 కేజీల సిమెంట్ మిశ్ర‌మం సిద్ధంగా ఉంటుంద‌ని గంగాధ‌ర్ చెబుతున్నాడు.

త‌న ప్ర‌య‌త్నం ఆత్మ‌సంతృప్తిని ఇస్తుంద‌ని, స్వ‌లాభం కోరుకుని చేస్తున్న ప‌ని కాద‌ని ఆయ‌న చెప్పాడు. జీహెచ్ఎంసీ కూడా గోతుల‌ను పూడ్చ‌డంలో బాగానే శ్ర‌మిస్తోంద‌ని, కానీ అన్ని ప్రాంతాల్లో ఉన్న‌ గోతుల‌ను బాగు చేయ‌డం వారికి సాధ్యం కావ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న ప్ర‌య‌త్నానికి ప్ర‌చారం రావ‌డం వ‌ల్ల చాలా మంది యువ‌కులు రోడ్లు బాగు చేయ‌డంలో స‌హాయం చేస్తున్నార‌ని గంగాధ‌ర్ తెలిపాడు.

More Telugu News