Pakistan: భారత్‌ను ఎదుర్కొనేందుకు షార్ట్-రేంజ్ అణ్వాయుధాలను తయారుచేశాం: పాక్ ప్రధాని

  • మా వద్ద ఉన్న అణ్వస్త్రాలు భద్రంగా ఉన్నాయి.. ఆందోళన వద్దు
  • అణ్వస్త్రాలపై మాకు పూర్తి నియంత్రణ ఉంది
  • స్పష్టం చేసిన షాహిద్ ఖాఖన్ అబ్బాసి

భారత సైన్యం ‘కోల్డ్ స్టార్ట్’ సిద్ధాంతం నుంచి తమను తాము రక్షించుకునేందుకు తక్కువ శ్రేణి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్టు పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసి తెలిపారు. పాక్ వద్ద అణ్వస్త్రాలు చాలా భద్రంగా, సురక్షితంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. న్యూయార్క్ లో ఓ సదస్సులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తమ అణ్వాయుధాలపై తమకు నియంత్రణ ఉందని, అవి సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశంలోని అణ్వాయుధశాల వ్యవహారాలను న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షిస్తుందని, కమాండింగ్, కంట్రోలింగ్ పవర్ దానికే ఉందని అబ్బాసి స్పష్టం చేశారు.

మోడరేటర్ డేవిడ్ సాంగెర్ మాట్లాడుతూ పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటూ పోతోందన్నారు. ప్రపంచంలో ఇంత వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న దేశం ఉత్తర కొరియా తర్వాత పాకిస్థానేనని ఆయన పేర్కొన్నారు. తమ ఆందోళనంతా అణ్వస్త్రాల భద్రతపైనేనని సాంగెర్ అన్నారు.

దీనికి పాక్ ప్రధాని స్పందిస్తూ తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఓ బాధ్యతాయుతమైన దేశమని, గత 15 ఏళ్లుగా ఉగ్రవాదంపై తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తమకు కూడా అణ్వస్త్ర సామర్థ్యం ఉందని, ఈ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు. 60లలోనే అణు కార్యక్రమాలను తాము చేబట్టామని, ఆసియాలో ఇలా అణు కార్యక్రమాలు ప్రారంభించిన తొలి దేశాలలో తమ దేశం కూడా ఒకటని అబ్బాసి వివరించారు. ఇప్పటికి 50 ఏళ్లుగా దీనిని రక్షించుకుంటూ వస్తున్నామని, ఇకపైనా రక్షించుకుంటామని అబ్బాసి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News