cm ramesh: సిమెంట్ రోడ్డు వేశాకే వీధిలోకి రండి... సీఎం రమేష్ కు చేదు అనుభవం!

  • మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడెందుకొచ్చారు?
  • మాటలు వద్దు, చేతలు కావాలి
  • రోడ్డు వేశాకే 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం నిర్వహించండి
  • సీఎం రమేష్ ను అడ్డుకున్న మహిళలు

సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఏపీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు మహిళలు తేల్చిచెప్పిన ఘటన కడప జిల్లా చాపాడులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలతో కలిసి చాపాడుకు సీఎం రమేష్ వెళ్లారు. అక్కడ సభ్యత్వ నమోదు చేసుకుంటూ జెడ్పీ హైస్కూల్‌ వెనుక వీధిలోకి అడుగుపెట్టారు. దీనిని ఆ వీధి వాసులు వ్యతిరేకించారు. ప్రధానంగా మహిళలు అడ్డుకున్నారు.

 మూడేళ్లుగా సిమెంట్ రోడ్డు వేయమని మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాధుడు లేడని వారు వాపోయారు. సిమెంట్‌ రోడ్డు వేశాకే తమ వీధిలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. మాటలతో ఉపయోగం లేదని, చేతల్లో చూపించాలని వారు సీఎం రమేష్ కు స్పష్టం చేశారు. దీంతో స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు శాంతించకపోవడం విశేషం. అదే సమయంలో పలువురు సర్పంచ్‌ లు స్పెషల్‌ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

More Telugu News