వర్మ: అందుకే, ఈ సినిమాకు ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు పెట్టాను: రామ్ గోపాల్ వ‌ర్మ

  • రామారావు జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను చూపిస్తా
  • ఆయ‌న జీవితంలోకి ఆమె ఎలా వ‌చ్చిందో చూపిస్తా
  • ఈ సినిమాను ఎమోష‌న‌ల్ డ్రామాగా తీస్తా

ప్ర‌జాస్వామ్య దేశంలో ఓ ద‌ర్శ‌కుడిగా ఓ వ్య‌క్తిపై సినిమా తీసే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ్యాఖ్యానించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్‌ను పెట్టి రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నానని రామ్ గోపాల్ వర్మ ప్ర‌క‌టించిన తర్వాత విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఈ రోజు వ‌ర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, ల‌క్ష్మీపార్వ‌తి రామారావు జీవితంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఈ సినిమాలో చూపిస్తాన‌ని చెప్పారు. అందుకే, ఈ సినిమాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టానని అన్నారు.

మొద‌టిసారి ల‌క్ష్మీపార్వ‌తి.. ఎన్టీఆర్‌ను క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. ఆయ‌న జీవితంలోకి ఆమె ఎలా వ‌చ్చిందో చూపిస్తాన‌ని అన్నారు. తాను ఓ సాధార‌ణ ప్రేక్ష‌కుడిగా ఎన్టీఆర్ ప‌క్కన జ‌య‌ప్ర‌ద, శ్రీదేవి వంటి వంటి పెద్ద పెద్ద హీరోయిన్‌లు న‌టించ‌డం చూశాన‌ని, అంత‌గొప్ప వ్య‌క్తి ఒక్క‌సారిగా సాధార‌ణ మ‌హిళ లక్ష్మీ పార్వ‌తికి అంత ద‌గ్గ‌ర ఎలా అయ్యారో తెలుసుకోవాల‌న్న ఆత్రుత త‌న‌కు క‌లిగింద‌ని చెప్పారు. ఈ సినిమాను ఎమోష‌న‌ల్ డ్రామాగా తీయాల‌నుకుంటున్నానని తెలిపారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిల్ ఎందుకు పెడుతున్నావ‌ని చాలా మంది అడిగార‌ని, అందుకే వివరణ ఇస్తున్నానని చెప్పారు.

More Telugu News