mexico: మాక్ డ్రిల్ నిర్వహించిన గంట వ్యవధిలోనే... మెక్సికోను ప్రకృతి పగబట్టిందంటున్న ప్రజలు!

  • 1985లో భారీ భూకంపం
  • అప్పట్లో వేలాది మంది మృతి
  • సరిగ్గా అదే రోజున మరో భూకంపం
  • తన ఇల్లు రక్తపు మడుగైందన్న మహిళ
  • పెరుగుతున్న మృతుల సంఖ్య

విధి ఎంతో బలీయమైనది. ఎప్పుడు ఏ రూపంలో వచ్చి విరుచుకుపడుతుందో తెలియదు. కానీ, మెక్సికో విషయంలో మాత్రం ప్రకృతి ఓ కచ్చితమైన సమయాన్ని పాటిస్తుండటం కాకతాళీయమే అయినా, సరిగ్గా 32 ఏళ్ల తరువాత అదే రోజు ఒకేరకమైన ఉపద్రవం అతలాకుతలం చేసింది. 1985 సెప్టెంబర్ 19న మెక్సికోను పెను భూకంపం వణికించి, వేలాది మంది ప్రాణాలను బలిగొనగా, సరిగ్గా అదే రోజున మరోసారి భూకంపం రావడం గమనార్హం.

వాస్తవానికి భూకంపం వస్తే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి యేటా సెప్టెంబర్ 19న మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా మెక్సికో నగరంలో నిన్న కూడా అటువంటి డ్రిల్ జరిగింది. భారీగా సైరన్ మోతలు ప్రారంభం కాగా, ప్రజలు హుటాహుటిన ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే 7.1 తీవ్రతతో భూకంపం రావడం గమనార్హం. తాజా భూకంపం ధాటికి మోరెలాస్ లో 55 మంది, మెక్సికో నగరంలో 32 మంది, గురేరియోలో ఒకరు, మెక్సికో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 9 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

తానున్న ప్రాంతానికి అత్యంత సమీపంలో భవంతి కుప్పకూలగా 40 మంది వరకూ శిథిలాల కింద ఉన్నారని విక్టర్ ఆరేచా అనే మహిళ పేర్కొంది. అందులో తన స్నేహితులు, బంధువులు ఉన్నారని, వారి ఆచూకీ తెలియడం లేదని వాపోయింది. ఈ తరహా భూకంపాన్ని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని మారిసెలా అవిలా గోమేజ్ వెల్లడించింది. కిటికీల అద్దాలు పగిలి దూసుకు వచ్చాయని, తన ఇల్లంతా రక్తపు మడుగులా అయిపోయిందని తెలిపింది. భూకంపం వచ్చిన తరువాత తన వద్దకు వచ్చేందుకు బయలుదేరిన తన భర్త ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాడని పేర్కొంది. మెక్సికోపై ప్రకృతి పగబట్టిందని ఆమె వాపోయింది.

కాగా, మధ్య మెక్సికోలో 7.1 తీవ్రతతో ఉన్న భూకంపం, దక్షిణ మెక్సికోలో 7.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. మొత్తం రూ. 6,500 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, అమెరికన్లు అధికంగా ఉండే ప్రాంతంలో భూకంపం సంభవించినప్పటికీ, మరణించిన వారిలో అమెరికన్లు ఉన్నట్టు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారమూ అందలేదని యూఎస్ ఎంబసీ ప్రతినిధి జాకబ్ సన్ వెల్లడించారు. మెక్సికోకు పూర్తి సహాయం అందిస్తున్నామని అన్నారు.

More Telugu News