junior NTR: ప్రిన్స్ మహేష్ బాబు లెక్కను ఎన్టీఆర్ సరిచేసేనా?

  • గతంలో మూడు సార్లు పోటీ పడ్డ మహేష్, ఎన్టీఆర్
  • 2003లో నాగా, ఒక్కడు - 2010లో బృందావనం, ఖలేజా
  • 2011లో ఊసరవెల్లి, దూకుడు
  • ఈ సంవత్సరం జై లవకుశ, స్పైడర్
  • రెండు చిత్రాలపైనా భారీ ఆశలు

మరికొద్ది రోజుల్లో తొలుత ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జై లవకుశ', ఆపై వారానికి మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన 'స్పైడర్' విడుదల కానున్నాయి. ఈ ఇద్దరు టాప్ హీరోల జాబితాలోనివారే కావడం, రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉండటంతో ఈ దసరా సీజన్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ రకమైన పండగే. ఇక వీరిద్దరి చిత్రాలూ ఒకే సమయంలో విడుదలై పోటీ పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో మూడు సార్లు వీరిద్దరి చిత్రాలూ పోటీ పడగా, రెండుసార్లు విజేతగా మహేష్ బాబు నిలిచారు. ఈ దఫా పోటీ నాలుగోసారి. ఇక ఇప్పుడు విజయం ఎవరు సాధిస్తారన్న విషయం ఎలానూ మరో వారంలో తేలిపోతుంది.

2003లో ఎన్టీఆర్ 'నాగా', మహేష్ 'ఒక్కడు' విడుదలయ్యాయి. 'నాగా' అట్టర్ ఫ్లాప్ కాగా, 'ఒక్కడు' ఘన విజయాన్ని అందుకుంది. ఆపై 2010లో మహేష్ 'ఖలేజా', ఎన్టీఆర్ 'బృందావనం' ఒకే సమయంలో పోటీ పడ్డాయి. అప్పుడు మాత్రం విజయలక్ష్మి ఎన్టీఆర్ ను వరించింది. ముచ్చటగా మూడోసారి 2011లో ఎన్టీఆర్ 'ఊసరవెల్లి', మహేష్ 'దూకుడు' వెండి తెరలను దసరా సీజన్ లో తాకగా, విజేత ఎవరన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొత్తం మీద వీరిద్దరూ మూడు సార్లు పోటీ పడగా, రెండుసార్లు మహేష్ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందడంలో ముందు నిలిచాయి. ఈ దఫా రెండు చిత్రాలూ సూపర్ హిట్ కావాలని పరిశ్రమ పెద్దలు కోరుకుంటున్నప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో లెక్క సరిచేస్తాడన్న నమ్మకంతో ఉన్నారు.

More Telugu News