పీవీ సింధుకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది!

  • వరల్డ్ బ్యాడ్మింటన్ లో తనను ఓడించిన ఒకుహరాపై నేడు మరో పోరు
  • కొరియా ఓపెన్ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు
  • నేడు ఉదయం 9 గంటల నుంచి మ్యాచ్
  • గెలవాలని అభిలషిస్తున్న భారత క్రీడాభిమానులు
వరల్డ్ బ్యాడ్మింటన్ పోరు ఫైనల్ లో తనను ఓడించిన జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై, తెలుగుతేజం పీవీ సింధుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించింది. నేడు జరిగే కొరియా బ్యాడ్మింటన్ ఫైనల్ లో ఒకుహరానే సింధు ప్రత్యర్థి. తుది సమరానికి సిద్ధమైన సింధు, తానేమిటో నిరూపించాలని భావిస్తుండగా, సింధుపై మరోసారి గెలవాలన్న లక్ష్యంతో ఒకుహరా బరిలోకి దిగనుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో త్రుటిలో స్వర్ణం చేజార్చుకున్న సింధు, ఆ పోటీలో తనను ఓడించిన ఒకుహరాల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

కాగా, శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో చైనాకు చెందిన హీ బింగ్ జియావోను గంటా ఆరు నిమిషాల్లో సింధు ఓడించింది. 21-10, 17-21, 21-16 తేడాతో ఆమెపై విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ పోటీల్లో నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన సింధు నేటి ఫైనల్ పోరులో విజయం సాధించాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Go Back to Shorts
PV sindhu
okuhara
korea badminton

More Telugu News