kcr: కేసీఆర్ నాటిన 'మహాఘని' మొక్క ఎండిపోయింది!

  • హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీఎస్ సర్కార్
  • అధికారుల అలసత్వం
  • ముఖ్యమంత్రి నాటిన మొక్కే వాడిపోతోంది
  • కొందరు కావాలనే చేశారంటున్న కాపలాదారు

హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొక్కలను నాటడంతోనే ఈ తతంగం ముగిసిపోతోంది. వాటిని బతికించుకునే శ్రద్ధ మాత్రం ఎవరిలో కనిపించడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్కే వాడిపోతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కరీంనగర్ జిల్లా మానేర్ కట్ట దిగువన మహాఘని మొక్కను కేసీఆర్ నాటారు. ప్రస్తుతం ఇది వాడిపోయింది. దీన్ని ఎలా బతికించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

దీనికి సంబంధించి కాపలాదారు ఓ కథనం వినిపిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి పది గంటల తర్వాత మూడు ద్విచక్రవాహనాలపై ఐదారుగురు వచ్చారని... వారంతా ఈ మొక్క వద్ద నిలబడి ఏదో చేస్తున్నట్టు తనకు అనిపించిందని... వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, తనను తిడుతూ వారు వెళ్లిపోయారని అతను చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే బల్దియా పర్యవేక్షకుడికి చెప్పానని తెలిపాడు. అయితే, ఆ రోజు నుంచి ఆ మొక్క క్రమంగా వాడిపోవడం మొదలైందని చెప్పారు. మరోవైపు, ముఖ్యమంత్రి నాటిన మొక్క పరిస్థితే ఇలా ఉంటే... ఇతర మొక్కల పరిస్థితి ఏమిటని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News