gurmeet: 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి ఉరికంబం... నేరం రుజువైతే గుర్మీత్ కు ఇదే శిక్ష!

  • రెండు హత్యలపై నేటి నుంచి విచారణ
  • జర్నలిస్ట్ రామ్ చందర్ ను చంపించాడని గుర్మీత్ పై అనుమానం
  • డేరా మాజీ మేనేజర్ రంజిత్ మరణం వెనుకా ఆయన హస్తం
  • ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ కు ఉరిశిక్ష కూడా పడనుందా? గతంలో ఆయనపై నమోదైన హత్య కేసుల్లో నేడు విచారణ జరగనుండగా, వీటిని ఆయనే చేయించాడని తేలితే మరణశిక్ష ఖాయమని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. డేరాలో అకృత్యాలు జరుగుతున్నాయని మొట్టమొదటిసారిగా  బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన, పూర సచ్ఛ్ జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి ఆత్మహత్య, అప్పట్లో డేరా మేనేజర్ గా పని చేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన రంజిత్ సింగ్ కేసుల విచారణ నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రారంభం కానుంది.

ఛత్రపతిని చంపించి ఆత్మహత్యగా చిత్రించారని, తన రహస్యాలను ఎక్కడ బయట పెడతాడోనన్న అనుమానంతో రంజిత్ నూ గుర్మీతే హత్య చేయించాడన్న అనుమానాలు ఎంతో కాలంగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో గుర్మీత్ పై ఇప్పటికే అభియోగాలు నమోదు కాగా, సాక్షుల విచారణ కూడా ముగిసింది. తుది వాదనలు నేటి నుంచి సాగనుండగా, డేరాలో అత్యాచారాలు, హత్యలకు సంబంధం ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించనున్నారు. ఇక హత్య కేసులో కనిష్ఠంగా యావజ్జీవం, గరిష్ఠంగా మరణదండన శిక్షలు విధించే భారత న్యాయస్థానాలు, ఈ కేసులో ఎలాంటి తీర్పును వెలువరిస్తాయన్న విషయాన్ని దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.

More Telugu News